
తెరుచుకోని అంబులెన్స్ డోర్లు
ఉక్కిరిబిక్కిరైన రోగి
ఆందోళనలో బంధువులు
జగిత్యాలటౌన్: అంబులెన్స్ డోర్ తెరుచుకోక లోపలున్న రోగి ఉక్కిరిబిక్కరయ్యాడు. బంధువులు తీవ్ర ఆందోళనకు గురైన ఘటన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ధర్మపురికి చెందిన గంగయ్యను 108 అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వద్ద వాహనాన్ని నిలిపిన డ్రైవర్.. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా ఎంతకూ తెరుచుకోలేదు. లోపల ఉన్న రోగి ఉక్కిరిబిక్కిరయ్యాడు. 15నిమిషాలపాటు తలుపులు తెరుచుకోకపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తండ్రితోపాటు లోపలే ఉన్న రోగి కుమారుడు కిటికీ నుంచి బయటకు దూకి 15నిమిషాల పాటు శ్రమించి అంబులెన్స్ తలుపులు తెరిచి గంగయ్యను బయటికి తీసి ఆస్పత్రిలోకి అడ్మిట్ చేశారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ తలుపులు రోగి ప్రాణాలకు అడ్డంకిగా మారితే రోగులకు సత్వర వైద్యం ఎలా సాధ్యమంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా అంబులెన్స్‌ల నిర్వహణ చర్చనీయాశంగా మారింది.