
ప్రయాణం..ప్రమాదం
● ఇరుకు రహదారితో ఇక్కట్లు ● ప్రమాదానికి గురవుతున్న వాహనాలు ● వెల్లుల్లలో విస్తరణకు నోచుకోని రహదారి ● రహదారి విస్తరణపై దృష్టి సారించని పాలకులు,అధికారులు
మెట్‌పల్లిరూరల్: ఇరుకు రహదారుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వేసిన రహదారులపై ప్రస్తుతం పెరిగిన జనాభా, వాహనాల సంఖ్యతో ఇబ్బందులు తలెత్తున్నాయి. గ్రామాల్లోని ఇరుకై న రహదారులపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో ముందుగా వచ్చే వాహనాలకు సైడ్ ఇస్తున్న తరుణంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలపై వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. రహదారి విస్తరణపై దృష్టి సారించాల్సిన పాలకులు, అధికారులు ఆ దిశగా ఆలోచన చేయడంలేదు.
ఇరుకై న రహదారి
మెట్‌పల్లి మండలం వెల్లుల్లలోని ప్రధాన రహదారి ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే ఈ రహదారి మీదుగానే పాటిమీది తండా, ఆత్మకూర్, ఆత్మనగర్, రామలచ్చక్కపేట, జగ్గాసాగర్, కేసీఆర్‌తండా, రంగారావుపేట, ఏఎస్‌ఆర్ తండా, విట్టంపేట, నిజామాబాద్ జిల్లా భీంగల్, చౌట్‌పల్లితో తదితర గ్రామాల వాహనదారులు మెట్‌పల్లితోపాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే మెట్‌పల్లి నుంచి ఆత్మకూర్, రంగారావుపేట, భీంగల్‌కు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రైవేట్ పాఠశాల బస్సులతో మరింత రద్దీగా మారి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. మరోవైపు రహదారికి ఇరువైపులా ఏళ్ల కిత్రం నిర్మించిన డ్రైనేజీ లోతట్టు ప్రాంతంలో ప్రమాదకరంగా ఉండడంతో భారీ వాహనాలు అందులోకి ఒరిగి బోల్తాపడుతున్నాయి. గతంలో ప్రమాదాలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయి.
విస్తరణ చేయకపోవడంతోనే..
పెరిగిన జనాభా, వాహనాలకు అనుగుణంగా రహదారుల విస్తరణ చేపడితేనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు. విస్తరణపై ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. అధికారులు స్పందించి రహదారి విస్తరణపై దృష్టి సారించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ప్రయాణం..ప్రమాదం