
కుటుంబ కలహాలతో ప్రశాంతతకు భంగం
జగిత్యాలజోన్: కుటుంబ సమస్యలతో భార్యాభర్తలు, గుంట భూమి కోసం అన్నదమ్ములు, ఆస్తి కోసం అక్కాచెల్లెళ్లు, తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని స్నేహితులు.. ఇలా గొడవలకు దిగుతుండటంతో ప్రశాంత జీవితానికి భంగం ఏర్పడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో శనివారం మెగా లోక్‌అదాలత్ నిర్వహించారు. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని కేసులను రాజీ చేసుకోవాలన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ మాట్లాడుతూ పెండింగ్ కేసులను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ్యశర్మ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుపై పైకోర్టులకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌లు లావణ్య, శ్రీనిజ, నిఖిషా, కరుణాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి పాల్గొన్నారు.
పరిహారం కింద రూ.35లక్షలు పంపిణీ
మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన మంద రమేశ్ ఇంటర్ చదువుతుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఎడమ కాలును మోకాలి పైవరకు తీసేశారు. ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్ ఉండడంతో ఇన్సూరెన్సు సంస్థ రూ.35లక్షల పరిహారం అందించేందుకు ముందుకొచ్చింది. ఆస్తి కోసం దూరమైన ఇద్దరు అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చారు. ఎక్కువ కేసుల పరిష్కారంలో కృషి చేసిన న్యాయవాదులను జడ్జిలు అభినందించారు. కక్షిదారులకు న్యాయమూర్తి వెయ్యి ప్యాకెట్ల పులిహోర పొట్లాలు అందించారు.
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి కోర్టుల పరిధిలో 3,084 కేసులు పరిష్కారమయ్యాయి. సివిల్ కేసులు 26, క్రిమినల్ కేసులు 2,997, ప్రి లిటిగేషన్ కేసులు 61 ఉన్నాయి. మోటారు వాహనాలకు సంబంధించిన 12 కేసుల్లో బాధితులకు రూ.75.64లక్షల పరిహారం అందించారు.
విడిపోయిన జంటలను కలిపిన న్యాయమూర్తులు
రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన వెంకటేశ్.. నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాలకు చెందిన హరిత దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. అలాగే జిల్లా కేంద్రానికి చెందిన సిరిన్ సుల్తానా, అహ్మద్ ముస్తాఫ్‌ఖాన్ వేర్వేరుగా ఉంటుండడంతో వారి పిల్లలు అనాథలుగా మారే అవకాశం ఏర్పడింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి చొరవతో రెండు జంటలు ఏకమయ్యాయి. న్యాయమూర్తులు వారిపై ఉన్న కేసులను తొలగించి.. ఇక నుంచి కొత్త జీవితానికి స్వాగతం పలకాలని ఆశీర్వదించారు.