
రెనే ఆస్పత్రిలో అధునాతన గుండె చికిత్స
కరీంనగర్‌టౌన్: నగరంలోని రెనే ఆస్పత్రిలో అధునాతన గుండె చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్‌తో కలిసి ఆపరేషన్ వివరాలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన అజయ్ అనే బాలుడికి పుట్టినప్పటి నుంచి గుండెకు రంద్రం ఉందని తెలిపారు. ఆయాసం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో గుండెదడ, బరువైన పనులు చేయలేక బాధపడుతున్నాడని వివరించారు. రెనే ఆస్పత్రికి వచ్చిన తర్వాత అతడికి మల్టీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ(ఎంఐసీఎస్) చేసినట్లు తెలిపారు. ఛాతి భాగంలో పూర్తిగా చీరకుండ, పక్కటెముకల మధ్యలో చిన్న గాటు పెట్టి ప్రత్యేకమైన పరికరం ద్వారా ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. మెట్రో సిటీలకే పరిమితమైన ఈ ఆపరేషన్ కరీంనగర్‌లోని రెనే ఆస్పత్రిలో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కీలుమార్పిడి శస్త్రచికిత్స వైద్యసేవలు తమ ఆస్పత్రిలో అక్టోబరులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్డియాలజీ డాక్టర్ దినకర్, చిన్నపిల్లల గుండె వైద్యుడు రాజావిజయేందర్‌రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రాచారి, నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్‌బాబు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.