
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కథలాపూర్: గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరైతే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. శుక్రవారం కథలాపూర్ మండలం చింతకుంట, భూషణరావుపేట గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. అంబారిపేటలో కొత్తగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని పరిశీలించారు. పీహెచ్‌సీలో ప్రజలకు అందిస్తున్న వైద్యం గురించి ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఇంటింటా జ్వర సర్వే చేయాలని, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా అందించాలన్నారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, గృహానిర్మాణశాఖ అధికారి ప్రసాద్, పంచాయతీరాజ్‌శాఖ ఈఈ లక్ష్మణ్‌రావు, తహసీల్దార్ వినోద్, ఎంపీడీవో శంకర్, వైద్యాధికారి రచన, ఏఈ జగదీశ్వర్ పాల్గొన్నారు.
పంచాయతీ భవనాలు పూర్తి చేయాలి
జగిత్యాల: జిల్లాలోని పంచాయతీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి, కొత్తవి నిర్మించేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, పంచాయతీ అధికారి మదన్‌మోహన్ పాల్గొన్నారు.