
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ ● గిరిజన మినీ గురుకులం సందర్శన
మల్లాపూర్: విద్యార్థులకు మెరుగైన విద్యబోధన అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండల కేంద్రంలోని గిరిజన మినీగురుకులం బాలికల పాఠశాలను గురువారం సందర్శించారు. విద్యాబోధన, వసతులు, పాఠశాల స్థితిగతులు, నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ఆరా తీశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కిచెన్‌గార్డెన్ ఏర్పాటు చేసుకుని కూరగాయలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్ లక్ష్మీప్రియాంక, తహసీల్దార్ రమేశ్‌గౌడ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి, ఎంపీవో జగదీశ్ ఉన్నారు.
పాఠాలో బోధించిన కలెక్టర్
పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు గణితం బోధించారు. గణితంపై పలు అంశాలను వివరించారు. మ్యాథ్స్‌లో మెలకువలు చెబుతుంటే విద్యార్థులు శ్రద్ధగా విన్నారు.
ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగం పెంచాలని కలెక్టర్ అన్నారు. ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఇసుకకు ఇబ్బంది లేకుండా సాండ్‌బజార్ ఏర్పాటు చేశామన్నారు. మండల, మున్సిపల్ అధికారులు గడువులోపు పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.