
కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాలఅగ్రికల్చర్: న్యాయవాదులు, న్యాయమూర్తుల సమన్వయంతోనే కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో గురువారం సమావేశమయ్యారు. ఈనెల 13న జరిగే లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేందుకు న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, కక్షిదారులకు ఇబ్బందిలేకుండా కేసులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు సహకరించాలన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి మల్లిక్ వెంకటసుబ్రహ్మాణ్య శర్మ మాట్లాడుతూ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులు, మోటార్ వాహనాలు, బ్యాంకు కేసులు పరిష్కరిస్తామన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కరంజియా నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు.