
దోపిడీ అరికట్టేందుకే సాండ్‌బజార్
జగిత్యాల: ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేవడంతోపాటు, ఇసుక దోపిడీని అరికట్టాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు సాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వాణీనగర్‌లో ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్‌ను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ సాండ్‌బజార్ ద్వారా ప్రజలకు తేలికగా ఇసుక లభిస్తుందని, స్టాక్ పాయింట్ల వద్ద రూ.800 చెల్లిస్తే ఇసుక ఇంటికే వస్తుందన్నారు. అలాగే దోపిడీని, దళారి వ్యవస్థను అరికట్టేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక తరలించడానికి లారీలు అందుబాటులో ఉంటాయని, ఇవి 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం ఏరియాల్లో మాత్రమే ఇసుక రీచ్ ఉన్నందున జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల ప్రజలకు ఇసుక కొనుగోలు చేయడం భారంగా మారిందన్నారు. జిల్లాకేంద్రంలో మూడున్నర ఎకరాల్లో ఇసుక బజార్ ఏర్పాటు చేశామని, తహసీల్దార్ వద్ద రూ.800 చలానా రూపంలో చెల్లించి ఇసుక పొందాలన్నారు. త్వరలోనే వెల్గటూర్‌లో కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, టీజీఎండీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ప్రాజెక్ట్ అధికారి వినయ్ పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాను నియంత్రించండి
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలో ఇసుక పాయింట్ ఏర్పాటు చేసిన దృష్ట్యా టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రి అడ్లూరి, కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.