
సీసీ కెమెరాలతో నేరాలకు చెక్
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో దొంగతనాల నియంత్రణకు పోలీసు శాఖ సీసీ కెమెరాల ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యింది. బల్దియాలో ఆరేళ్ల క్రితం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పర్యవేక్షణ లేక నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో పట్టణంలో సీసీ కెమెరాలు ఉండాలన్న ఉద్దేశంతో రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సుధీర్‌రావు, మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్ ఆధ్వర్యంలో పలుమార్లు వర్తకసంఘం నాయకులతో సమావేశమయ్యారు. వారి సహకారంతో గాంధీచౌక్, శివాజీ ఏరియా, పాతబస్టాండ్, కోరుట్ల క్రాసింగ్‌రోడ్ వంటి ప్రదాన ఏరియాల్లో 25 సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని మరో రెండుమూడు రోజుల్లో ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పట్టణ ప్రజల చైతన్యం..
రాయికల్‌లో తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో నిందితులను పట్టుకోవడం గగనమైంది. సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ఎలాగైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలన్న ఉద్దేశంతో మున్సిపల్ నుంచి రూ.1.50లక్షలు, వర్తక సంఘం, హార్డ్‌వేర్, ఫర్టిలైజర్, గోల్డ్‌స్మిత్, బట్టల వర్తక సంఘాల నుంచి నిధులు సేకరించారు. వచ్చిన నిధులను సీసీకెమెరాల వినియోగించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. వారి సూచనల మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంకొన్ని నిధులు ఉండడంతో మరికొన్ని సీసీకెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. బల్దియాలోని 12వార్డుల్లో కౌన్సిలర్లు, స్థానికుల సహకారంతో మరిన్ని ఏర్పాటు చేస్తామని, వాటి పర్యవేక్షణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని స్థానికులు అంటున్నారు. ఈ కెమెరాలు బిగిస్తే పట్టణంలో దొంగల బెడద, పోకిరీల బెడదకు చెక్ పెట్టే అవకాశం ఉంది.

సీసీ కెమెరాలతో నేరాలకు చెక్