
నియోజకవర్గానికి ఆది శ్రీనివాస్ చేసిందేమీలేదు
కొబ్బరికాయ కొడితేనే పని అయిపోయినట్లా..? ఎమ్మెల్యేపై రోజురోజుకూ నమ్మకం పోతోంది బీఆర్‌ఎస్ వేములవాడ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు
మేడిపల్లి: సానుభూతితో గెలిచిన ఆది శ్రీనివాస్ ఇప్పటివరకు నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, కేవలం కొబ్బరికాయ కొట్టినంతా మాత్రనా అభివృద్ధి చేసినట్లు కాదని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. మేడిపల్లి, భీమారం మండలాల్లో పర్యటించిన ఆయన గోవిందారంలో విలేకరులతో మాట్లాడారు. చందుర్తి, మోత్కురావుపేట రోడ్డును గెలిచాక మూడు నెలల్లో పూర్తిచేస్తానని చెప్పి ఓట్లు దండుకుని 21 నెలలు అయినా ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదని ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికీ ఎమ్మెల్యే అసమర్థత అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే అటవీశాఖ భూమికి ప్రత్యామ్నాయంగా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో ఇచ్చామన్నారు. నిత్యం మండలానికి రాకపోకలు సాగిస్తున్న ఎమ్మెల్యేకు రోడ్ల పరిస్థితి కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. రాజలింగంపేట కుంట తెగి, బ్రిడ్జి కూలిపోయి రోజులు గడుస్తున్నా..పట్టించుకోవడంలేదన్నారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎంతసేపూ కేసీఆర్‌పై నిందలు వేయడం తప్ప.. రైతులను ఆదుకున్న దాఖాలాలు లేవన్నారు. కలిగోటలోని సూరమ్మ చెరువును పూర్తి చేయాలని ప్రతినెలా 22వ తేదీన ధర్నాలు చేశారని, ఇప్పుడు గెలిచి 22 నెలలు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. సూరమ్మ చెరువు భూసేకరణకు సుమారు 1800 ఎకరాలు అవసరమని, రూ.450కోట్లు కావాలని, ఇప్పటికి రూ.10 కోట్లు మాత్రమే తెచ్చినప్పటికీ గుంట భూసేకరణ జరగలేదని పేర్కొన్నారు. 21నెలల్లో రూ.10 కోట్లు తెస్తే మిగతా రూ.440 కోట్లు తెచ్చేందుకు ఎన్నేళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. నాలుగుసార్లు ఓడిపోయానని ఆది శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకుంటే జనాలు ఓట్లేశారని, వారిని ఇప్పుడు మోసం చేయొద్దని హితవు పలికారు.