
రెవెన్యూ.. ఇసుక
మాఫియా చెట్టాపట్టాల్
● కోరుట్ల రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఓ నాల్గో తరగతి ఉద్యోగి తన బంధువుల పేరిట ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుక తవ్వకాలు సాగిస్తూ అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం రెవెన్యూ వర్గాల్లో అందరికి తెలిసినా పట్టించుకునే నాథుడే లేడు.
● మెట్‌పల్లి పాత తాలుకా పరిధిలోని ఓ మండలంలో పనిచేస్తున్న ఇద్దరు గిర్దవార్ల మధ్య ఇసుక ‘మామూళ్ల’ పంచాయితీ సాగుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఒకరిపైనొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. అది కూడా ఇసుక ఆక్రమ రవాణాదారులతోనే కావడం గమనార్హం.
● కథలాపూర్ మండలం సిరికొండ–తక్కళ్లపల్లి శివారు నుంచి ప్రతీరోజు రాత్రి సమయంలో చెన్నూర్ ఇసుక పర్మిట్ల పేరిట సుమారు 10 నుంచి 15 లారీలు జిల్లా సరిహద్దు దాటుతున్నాయి. వారి ప్రాంతంలో ఇసుకరీచ్ ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్నా.. రెవెన్యూ అఽధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తూ వారానికి ఓసారి మొక్కుబడిగా ఒకటి రెండు లారీలకు జరిమానాలు వేసి వదిలేస్తున్న వైనం అనుమానాస్పదంగా ఉంది.
● ఇటీవల కోరుట్లలో ఓ ఇసుక అక్రమ రవాణాదారు ఏర్పాటు చేసిన ఫంక్షన్‌కు కోరుట్ల, కథలాపూర్ ప్రాంతాల రెవెన్యూ అధికారులు పోటాపోటీగా వచ్చి విందులు ఆరగించడం గమనార్హం. కిందిస్థాయి ఉద్యోగులు అక్కడే మందు పార్టీ చేసుకోవడం గమనార్హం.
ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎక్కడిక్కడే రెవెన్యూ ఉద్యోగులు ఇసుక మాఫియాతో కుమ్మకై ్కన ఆనవాళ్లు కనిపిస్తాయి. దీని ఫలితంగానే ఇసుక అక్రమంగా అడ్డూఅదుపు లేకుండా రవాణా అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోరుట్ల: కోరుట్ల, మెట్‌పల్లి రెవెన్యూ సబ్ డివిజన్ల పరిధిలో ఇసుక అక్రమార్కులతో కిందిస్థాయి రెవెన్యూ అధికారులు సంబంధాలు నెరుపుతున్న ఫలితంగా ఉన్నతాధికారులు ఎంత నిక్కచ్చిగా వ్యవహరించినా మార్పు రావడంలేదు. కోరుట్ల మండలం నాగులపేట, పైడిమడుగు, కథలాపూర్ మండలం సిరికొండ, తక్కళ్లపల్లి, బొమ్మన శివారుల్లో మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ వాగు, మల్లాపూర్ మండలంలోని వేంపల్లి–వెంకట్రావ్‌పేట, రేగుంట ఏరియాలో ఇసుక అక్రమ రవాణాతో భూగర్బజలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాగుల పరిసరాల్లో కొట్టుకుపోయి చుట్టుపక్కలతోటలు, పొలాల్లో వరదలు వచ్చిన సమయంలో మేటలు వేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఏడాది క్రితం పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
భారీగా జరిమానాలు
ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగి ఇసుక అక్రమ రవాణాకు పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కొన్నిరోజుల పాటు ఇసుక అక్రమ రవాణా నిలిచిపోయింది. అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ట్రాక్టర్‌కు రూ.25 వేలు, లారీకి రూ.50వేల చొప్పున జరిమానా విధించారు. ఒక్క కోరుట్లలోనే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 40 ట్రాక్టర్లను పట్టుకుని నెల రోజల పాటు రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంచారు. చివరికి ట్రాక్టర్లను వదిలేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో పట్టుబడిన ట్రాక్టర్లకు భారీగా జరిమానా వేసి వదిలేశారు. ఇదే రీతిలో మెట్‌పల్లి, మల్లాపూర్ మండలాల్లో ఆ సమయంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కొన్నాళ్లు పాటు నిక్కచ్చిగా వ్యవహరించారు.
మళ్లీ మొదటికి..
ఇసుక అక్రమ రవాణాదారులు కొంతమంది కింది స్థాయి రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క అడపదపా ట్రాక్టర్లను పట్టుకుని జరిమానాలు వేసినట్లు ఉన్నతాధికారులకు చూపి, మిగిలిన ట్రాక్టర్లు, లారీలను వదిలేయాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఆర్నెళ్ల వ్యవధిలో కోరుట్ల, మెట్‌పల్లి సబ్ డివిజన్లలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకోవడం.. జరిమానా వేయడం చాలా మేర తగ్గిపోయింది. ప్రతీరోజు కోరుట్ల, కథలాపూర్ మండలాల నుంచి కనీసం 50 ట్రాక్టర్లు, 15 లారీల్లో ఇసుక తరలిపోతుండగా..నెలకు ఓ పది ట్రాక్టర్లు, రెండు మూడు లారీలు పట్టుకుని జరిమానా వేసి వదిలేస్తున్న వైనం రెవెన్యూ తీరుకు అద్దం పడుతోంది. ఇక్కడితో సరిపెట్టుకోకుండా కొంత మంది రెవెన్యూ ఉద్యోగులే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణాను సక్రమంగా చేసుకోవడానికి కాగితాలు సృష్టించుకోమని అక్రమార్కులకు సూచిస్తున్నట్లు సమాచారం.
ఆగని ఇసుక అక్రమ రవాణా

రెవెన్యూ.. ఇసుక