
గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం వేంపేట మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకుడు మారంపెల్లి శ్రీనివాస్(53) గుండెపోటుతో మృతి చెందారు. తిరుమలతిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి సోమవారం వెళ్లాడు. తిరుపతిలోనే మంగళవారం గుండెపోటుకు గురై మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. శ్రీనివాస్‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.
పారిశుధ్య కార్మికుడు..
పెగడపల్లి: మండలంలోని కీచులాటపల్లిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు కొత్తపల్లి సత్తయ్య (50) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. పేద కుటుంబానికి చెందిన సత్తయ్య మృతిపై గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారులో అచ్చ గంగారాం (56) ద్విచక్ర వాహనం ఢీకొని మృతిచెందాడు. గంగారాం సోమవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి బయల్దేరాడు. మోరపల్లి బైపాస్‌రోడ్ వద్ద జగిత్యాలకు చెందిన మహేశ్ ద్విచక్ర వాహనంతో వెనుక నుంచి గంగారాంను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన గంగారాంను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. గంగారాం కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.
మెట్‌పల్లి: పట్టణ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మగ్గిడి నర్సయ్య(59) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపేటకు చెందిన నర్సయ్య ద్విచక్ర వాహనాంపై పని నిమిత్తం మెట్‌పల్లికి వస్తున్నాడు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కౌలు రైతు ప్రాణం తీసిన ఫైనాన్స్ వేధింపులు
● ట్రాక్టర్ లాక్కెళ్లిన ఫైనాన్స్ ప్రతినిధులు
● కిస్తీలు చెల్లించాలని ఒత్తిడి
● మనస్తాపంతో ఆత్మహత్య
తిమ్మాపూర్: ఆర్థిక పరిస్థితి బాగాలేక ఫైనాన్స్‌లో అప్పు చేసిన ఓ కౌలు రైతు సదరు ఏజెంట్ల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఈ విషాద ఘటన తిమ్మాపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్‌ఎండీ ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపగోని బాబు (43) భార్య పద్మతో కలిసి గ్రామంలో కొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు సంతానం. గతంలో ట్రాక్టర్ కొన్న బాబు ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు సక్రమంగానే కిస్తీలు చెల్లించాడు. తర్వాత ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రెండు కిస్తీలు చెల్లించలేకపోయాడు. దీంతో సదరు ఫైనాన్స్ ఉద్యోగి ఒకరు ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. మరోసారి ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఇటీవలే తన ఇంటిపై మరో ఫైనాన్స్ సంస్థలో రుణం పొందాడు. బయట రూ.4లక్షలు అప్పు ఉండడం.. రెండు ఫైనాన్స్‌ల్లో వడ్డీతో కలిపి రూ.8 లక్షలకు చేరడంతో కిస్తీలు చెల్లించడం గగనంగా మారింది. మరోవైపు ఫైనాన్స్ సిబ్బంది నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బాబు ఈనెల6న ఉదయం పొలం వద్దకని చెప్పి వెళ్లి గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున మృతిచెందాడు. బాబు భార్య పద్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి