
జీవించు.. సాధించు
జీవితంపై ఆసక్తి కలిగించాలి
కరీంనగర్‌టౌన్: సృష్టిలో ఏ జీవికి ఆత్మహత్య ఆలోచన రాదు. ఒక్క మనిషికే ఆ విపరీత బుద్ధి. చిన్న సమస్య రాగానే తల్లడిల్లిపోతాడు. చావే భయమన్న భ్రమలో పడిపోతాడు. అక్షరాస్యులైనా.. నిరక్షరాస్యులైనా... నిరుద్యోగి అయినా.. జీవితంలో స్థిరపడ్డవారైనా... చిన్నపాటి సమస్యకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమ వైఫల్యం... ఒంటరితనం.. నిరుద్యోగం... ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ కలహాలు.. కారణమేదైనా ప్రాణాలు వదులుతున్నారు. జీవితాన్ని జయించలేక చావుకు చేరుకుంటున్నారు. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కథనం.
పెరుగుతున్న బలవన్మరణాలు...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలవన్మరణాలు భయపెడుతున్నాయి. ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగం విద్యార్థులే కావడం బాధాకర విషయం. చదవలేక కొందరు, సహచర విద్యార్థులు, ఫ్యాకల్టీ వేధింపులతో మరికొందరు, మార్కులు రాలేదని ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో బలమైన కారణాలు కనిపించడం లేదని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి బాగా మానసిక ఒత్తిడికి లోనైప్పుడు, సమస్యకు పరిష్కారం లభించనప్పుడు, తమకు ఏంచేయాలో, సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఉద్యోగం లేదని, మానసిక రుగ్మతలు, మత్తు మందులకు బానిసవడం, విపరీతమైన భయం, ఎక్కువగా నిరాశకు గురికావడం, విపరీతమైన అప్పులు, జీవితంపై నమ్మకం సన్నగిల్లడం, వ్యవసాయంలో నష్టాలు, పరీక్షలో ఉత్తీర్ణత కాకపోవడం ఇలా అనేక కారణాలు ఉంటున్నాయి. ఆత్మహత్యల నివారణకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల పాత్ర కీలకం. నిరాశతో ఉన్న వారిని గమనిస్తూ ఉండాలి. వారిని దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా ఓదార్చాలి. నేనున్నానంటూ భరోసా కల్పించాలి.
ఒత్తిడిని అధిగమించలేక ఆత్మహత్యలు
జిల్లాలో పెరుగుతున్న బలవన్మరణాలు
సమస్య ఏదైనా చావు మాత్రమే పరిష్కారం కాదు
నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
ఆత్మహత్యాయత్నం ఓ మానసిక సమస్య. చనిపోయినంత మాత్రాన సమస్య తీరదు. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి ముందు ఒంటరితనాన్ని కోరుకుంటారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. అటువంటి వారిని గుర్తించి చికిత్స చేయించడం అత్యవసరం. వారిని నెమ్మదిగా నలుగురిలోకి తీసుకువెళ్లాలి. జీవితంపై ఆసక్తి కలిగించేలా చూడాలి. అప్పుడే ఆత్మహత్య ఆలోచనను దూరం చేయవచ్చు.
డాక్టర్ ఎల్. వర్శి, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి

జీవించు.. సాధించు