
లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్టు
కరీంనగర్‌క్రైం: నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలో మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరోంచ పరిధిలో ఉన్న లక్ష్మీదేవిపేటకు చెందిన పెద్ది దక్షిణ్ ఊరాఫ్ దక్షిణామూర్తి (23) కరీంనగర్ వచ్చి రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేశాడు. మద్యం సేవించి విధులకు హాజరుకావడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. కొంతకాలం స్వగ్రామంలో ఉండి తిరిగి కరీంనగర్ వచ్చాడు. ఆదర్శనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో కంపౌండర్‌గా చేరాడు. మద్యం తాగడంతో పాటు అశ్లీలచిత్రాలు చూసే అలవాటు ఉన్న దక్షిణామూర్తి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతిపై ఈనెల 6న వేకువజామున మత్తుమందిచ్చి లైంగికదాడి చేశాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, మంగళవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఘటనపై కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామని, ఆస్పత్రుల్లో భద్రతా చర్యలపై త్వరలోనే ఆసుపత్రి యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు(చైల్డ్ ఫోర్నోగ్రఫీ) చూస్తే పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో 30మందిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. సమావేశంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి పాల్గొన్నారు.