రైస్‌మిల్లర్లకు గడువు గండం | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లర్లకు గడువు గండం

Sep 9 2025 8:37 AM | Updated on Sep 9 2025 2:31 PM

బియ్యం అప్పగింతకు ఈనెల 12 చివరి తేదీ 

అయోమయం చెందుతున్న రైస్‌మిల్లర్లు 

ఎఫ్‌సీఐ గోదాముల్లో ఖాళీ కాని బియ్యం

జగిత్యాలరూరల్‌: ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు అప్పగించి.. వారి నుంచి బియ్యం (సీఎంఆర్‌) సేకరిస్తుంది. ఇందులో కొంత బియ్యం ఎఫ్‌సీఐ.. మరికొంత బియ్యం సివిల్‌సప్‌లైకి చేరుతుంది. అయితే 2024–25 ఖరీఫ్‌ సీజన్‌లో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఈనెల 12లోపు అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకు మిల్లర్లు బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎఫ్‌సీఐ బియ్యం నిల్వ చేసేందుకు గోదాములు లేక బియ్యం తీసుకోవడం లేదు. దీంతో మిల్లర్లు పట్టిన బియ్యాన్ని నిల్వ చేయలేక ఆందోళనకు గురవుతున్నారు.

2024–25 ఖరీఫ్‌

జిల్లాలో 2024–25 ఖరీఫ్‌లో ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 3 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించింది. ఆ ధాన్యాన్ని జిల్లాలోని 120 రైస్‌మిల్లులకు అప్పగించింది. ఈ లెక్కన ప్రభుత్వానికి రెండు లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ ఎఫ్‌సీఐతోపాటు, సివిల్‌సప్‌లైకి 1.40 లక్షల టన్నుల బియ్యం అప్పగించారు. ఇంకా 60వేల టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా ప్రభుత్వం ఈనెల 12 చివరి గడువుగా విధించింది. దీంతో మిల్లర్లు బియ్యం సిద్ధం చేసినా ఎఫ్‌సీఐ, సివిల్‌సప్‌లైగానీ తీసుకోవడం లేదు. ఎఫ్‌సీఐ 55వేల టన్నులు తీసుకోవాల్సి ఉండగా.. జిల్లాలో వారి గోదాములు పూర్తిగా నిల్వ ఉండటంతో తీసుకోవడం లేదు. అలాగే 5 వేల టన్నుల సివిల్‌ సప్‌లై తీసుకోవాల్సి ఉండగా.. వారు కూడా బియ్యం తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

ఖాళీకాని గోదాములు

నాలుగు నెలలుగా ఎఫ్‌సీఐ గోదాముల్లో పూర్తిస్థాయిలో బియ్యం నిల్వ ఉండటంతో వాటిలో మిల్లర్ల నుంచి తీసుకున్నవి నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ఇతర గోదాములకు తరలిద్దామన్నా.. అవి కూడా నిండుగా ఉండటంతో మిల్లర్లు బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు తీసుకోవడం లేదు.

ఖరీఫ్‌ ధాన్యం పెట్టేదెక్కడ..?

జిల్లాలోని ప్రభుత్వ ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఇప్పటికే రైస్‌మిల్లుల్లో పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. మళ్లీ ఖరీఫ్‌ సీజన్‌ ఈనెల చివరి నుంచి ప్రారంభమవుతుంది. దీంతో మళ్లీ ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక అయోయమంలో పడుతున్నారు. దీంతోపాటు గడువులోపు ఇవ్వకపోతే ప్రభుత్వం మిల్లర్లను డిఫాల్ట్‌ కింద వారికి ధాన్యం కేటాయించకుండా నిర్ణయం తీసుకోనుంది.

ట్రాక్‌ రిపేరుతోనే జాప్యం

ఎఫ్‌సీఐ, సివిల్‌ సప్‌లై గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ప్రతినెలా సుమారు 4 నుంచి 6 వ్యాగన్లు ఇతర ప్రాంతాలకు బియ్యాన్ని తరలిస్తుంటారు. కొద్దిరోజులుగా లింగంపేట రైల్వేస్టేషన్‌లో ట్రాక్‌ మరమ్మతు నేపథ్యంలో వ్యాగన్లు రావడం లేదు. దీంతో గోదాముల్లో ఉన్న బియ్యం ఖాళీ చేయడం కూడా అధికారులకు కష్టంగా మారింది.

మిల్లర్లకు భారం

రైస్‌మిల్లర్లు ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యాన్ని బియ్యంగా చేసి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా గోదాములు ఖాళీ లేక తీసుకోకపోవడంతో నెల రోజులుగా రైస్‌మిల్లులను పూర్తిగా మూసివేశారు. దీంతో వారికి విద్యుత్‌ చార్జీలతోపాటు, ఆపరేటర్ల వేతనాలు, హమాలీల వేతనాలు చెల్లించడం భారంగా మారింది.

ట్రాక్‌ రిపేరుతోనే జాప్యం

జిల్లాలో 2024–25 ఖరీఫ్‌ వరిధాన్యం తీసుకున్న మిల్లర్లు ఈనెల 12లోపు బియ్యం అప్పగించాల్సి ఉంది. సివిల్‌సప్‌లైకి 5 వేల టన్నులు, ఎఫ్‌సీఐకి 55 వేల టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. కానీ ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీ లేకపోవడం, రైల్వేట్రాక్‌ మరమ్మతుతో గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సాధ్యం కావడం లేదు.
 – జితేంద్రప్రసాద్‌, ఇన్‌చార్జి డీఎస్‌వో, సివిల్‌సప్లై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement