
కరెంట్ లేక రోగులు విలవిల
దవాఖానాలో కమ్ముకున్న చిమ్మచీకటి
ఇబ్బంది పడిన రోగులు, బంధువులు
చెట్లు తొలగించేందుకేనన్న అధికారులు
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. ఆస్పత్రి ఆవరణలో పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించడంలో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆస్పత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెట్లకొమ్మలు, చెట్లు తొలగించడమే మంచిదే అయినా.. ఆస్పత్రిలో రోగులు లేనప్పుడో.. వారికి మరోచోట సౌకర్యాలు ఏర్పాటు చేశాక ముందుకెళ్తే బాగుండేది. అసలే వ్యాధులకాలం కావడంతో ఆస్పత్రిలో రోగులు చాలామంది ఉన్నారు. డయాలసిస్ కేంద్రం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే చెట్లు తొలగించడం కోసమని కరెంట్ తొలగించారు. మధ్యాహ్న సమయంలో ఎండవేడిమి ఎక్కువగా ఉండటంతో రోగులు ఉక్కపోత భరించలేకపోయారు. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకు కరెంట్ రాకపోవడంతో రోగులు బెడ్లపైనుంచి లేచి బయటకు రావాల్సి వచ్చింది. టార్చ్‌లైట్ వెలుతురులోనే కొందరికి డయాలసిస్ చేపట్టారు.
జనరేటర్ ఉన్నా..
ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు లేకుండా కరెంట్ పోయినప్పుడు జనరేటర్ సౌకర్యం ఉంది. కానీ దానిని ఆన్ చేయకపోవడం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చెట్ల కొమ్మలు నరికి వేస్తున్నప్పుడు కరెంట్‌తోపాటు, జనరేటర్ కూడా ఆన్‌చేయవద్దని, కరెంట్ పాస్ అవుతుందని, అందుకే జనరేటర్ ఆన్ చేయలేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
చెట్ల కొమ్మలు తొలగించాం
ప్రధాన ఆస్పత్రి బిల్డింగ్ చుట్టూ చెట్లు పెరిగిపోవడంతో వర్షం పడినప్పుడు ఇబ్బంది ఎదురవుతోంది. కొన్నిసార్లు ఏరుస్తోంది. ఎప్పటి నుంచో తొలగించాలనుకున్నాం. రోగులు అధికంగా ఉండటంతో చేయలేకపోయాం. సోమవారం కొంత తక్కువ మంది ఉండటంతో అటవీశాఖ అనుమతితో ఈ కార్యక్రమం చేపట్టాం. సుమన్‌రావు, ఆర్‌ఎంవో