
జీపీవోలకు కౌన్సెలింగ్ పూర్తి
మెరిట్ ప్రాతిపదికన పోస్టింగ్‌లు సొంత నియోజకవర్గంలో నో చాన్స్ గ్రామాల్లో కొలువుదీరనున్న జీపీవోలు అలాట్‌మెంట్ జీపీవోలు 218 మొత్తం రెవెన్యూ విలేజెస్ 300
జగిత్యాల: మరో రెండు రోజుల్లో గ్రామపాలన అధికారులు విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు వారికి కలెక్టరేట్‌లో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. మెరిట్ ప్రతిపాదికన పోస్టింగ్ ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న ఉద్దేశంతో గ్రామపాలన అధికారులు (జీపీవో)లను నియమించేందుకు చర్యలు తీసుకుంది. గతంలో వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ ఉండటంతో ప్రభుత్వం వారిని తొలగించడంతో వ్యవస్థ కుంటుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ వారిని తీసుకొచ్చేందుకు అర్హత పరీక్ష నిర్వహించి ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందించింది.
కౌన్సెలింగ్ పూర్తి
జిల్లాకు కేటాయించిన గ్రామ పాలన అధికారులకు కౌన్సెలింగ్ పూర్తయింది. వారికి పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా స్థానికత వివరాలు, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి మంగళవారం నుంచి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. జిల్లాలో 300 రెవెన్యూ విలేజ్‌లు ఉండగా ఒక్కొక్కరికి రెండుమూడు గ్రామాలు కేటాయించనున్నారు.
సొంత నియోజకవర్గంలో నో పోస్టింగ్
గ్రామపాలన అధికారులుగా నియమితులైన వారికి సొంత నియోజకవర్గంలో పోస్టింగ్ ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది. సొంత నియోజకవర్గంలో పోస్టింగ్ ఇచ్చేలా చూడాలని గ్రామపాలన అధికారులు కోరుతున్నా ప్రభుత్వం నో చెప్పింది.
అప్పుడే పైరవీలు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ అప్పుడే పైరవీలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్పౌజ్ ఉన్న వారికి ప్రత్యేక కేటగిరిల్లో పోస్టింగ్ ఇస్తున్నారు.
జిల్లాలో మొత్తం 218 మంది జీపీవోలు ఎంపికయ్యారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించాం. త్వరలో పోస్టింగ్‌లు ఇస్తాం. వారు మరో రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. భూభారతి చట్టం పకడ్బందీగా నిర్వహించడం కోసం జీపీవోలను నియమించాం.
సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్
త్వరలో పోస్టింగ్‌లు
డివిజన్ విలేజ్‌లు క్లస్టర్లు
జగిత్యాల 190 130
కోరుట్ల 53 45
మెట్‌పల్లి 57 43