
వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి
కొడిమ్యాల: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం సందర్శించారు. ల్యాబ్‌లో వైద్య పరీక్షల వివరాలు, స్టాఫ్ హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఫార్మసీ విభాగంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎంతమంది రోగులు వస్తున్నారు..? ఎంతమంది అడ్మిట్ అవుతున్నారని ఆరా తీశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు చేయించాలని సూచించారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే మెరుగైన వైద్య చికిత్స అందించే అవకాశం ఉంటుందని వివరించారు. వైద్య సిబ్బంది విధులకు సకాలంలో హాజరుకావాలన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఏపీఆర్‌ఓ లక్ష్మణరావు, వైద్య పోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీవో స్వరూప సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుట్టుమిషన్ల ద్వారా జీవనోపాధి
ధర్మపురి: కుట్టుమిషన్ల ద్వారా మహిళలో ఆత్మస్థైర్యం, జీవనోపాధి పెరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిశోర్, ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుములు లావణ్య అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని రాజారంలో కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. శిక్షణ పొందిన 32 మందికి ఉచితంగా మిషన్లు అందించామన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, పీఎసీఎస్ చైర్మన్ నరేశ్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, కాంగ్రెస్ నాయకులు ఎస్.దినేష్, సుముక్ తదితరులున్నారు.
కాకతీయ కాలువకు నీటి విడుదల పెంపు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు సాగు నీరు అందించే కాకతీయ కాలువకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి సామర్థ్యం పెంచారు. మొన్నటి వరకు 3500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయగా.. శనివారం 5,500 క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు నుంచి 24,397 క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. వరదకాలువకు 18 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు.
ముగిసిన భాగవత సప్తాహం
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో భాగవతా సప్తాహం శనివారం ముగిసింది. శ్రీశారద మహిళా మండలి ఆధ్వర్యంలో కరీంనగర్‌కు చెందిన పురాణం మహేశ్వర్‌శర్మ ఈనెల ఒకటిన భాగవత సప్తాహం ప్రారంభించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరై ప్రవచకులను స్వామివారి శేషవస్త్రంతో సన్మానించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, మహిళా మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు.
యూరియా కొరతకు కేంద్రమే కారణం
సారంగాపూర్: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం సారంగాపూర్‌కు చెందిన రైతులు జీవన్‌రెడ్డిని జిల్లాకేంద్రంలో కలిసి యూరియా సమస్యను వివరించారు. వరికి చివరి మోతాదు అందించాల్సి ఉన్న క్రమంలో కొరత వేధిస్తోందన్నారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ.. యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రెండు, మూడురోజుల్లో సరిపడా నిల్వలు అందుతాయని తెలిపారు. రాష్ట్రానికి రెండు లక్షల టన్నుల యూరియా అవసరం ఉందన్నారు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి

వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి