
‘ఉత్తమ’ అవార్డు ఎంపికలో అవకతవకలు?
మండలానికి ముగ్గురు చొప్పున ఎంపికకు ఉత్తర్వులు కొన్ని మండలాల నుంచి నలుగురు.. నాలుగు మండలాల్లో ఇద్దరు చొప్పున ఎంపిక
కథలాపూర్: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో జిల్లా విద్యాశాఖ అధికారులు కొన్ని మండలాలపై వివక్ష చూపించారంటూ ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతి మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు మించకుండా అవార్డుకు ఎంపిక చేయాలని ఎంఈవోలకు గతనెల 26న జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఆర్సీ నంబర్ 4353/బీ2/2025 ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో 20 మండలాలున్నాయి. ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయుల పేర్లను జిల్లాస్థాయి అవార్డుకు పంపించాల్సి ఉంది. అయితే ఈనెల 5న ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాలో కొన్ని మండలాల నుంచి నలుగురి పేర్లు, కొన్ని మండలాల నుంచి ఇద్దరి పేర్లు ఉండటంతో ఉపాధ్యాయవర్గాల్లో సందేహాలు నెలకొన్నాయి. జాబితా తయారీలో ఫైరవీలు చోటుచేసుకున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
ఎంఈవోలు పంపిన జాబితాలో ముగ్గురు
జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. ఈ లెక్కన విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 60 మందినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ.. జాబితాలో మాత్రం 61 మంది ఉపాధ్యాయుల పేర్లు ఉన్నాయి. ప్రతి మండలం నుంచి ముగ్గురిని మాత్రమే ఎంపిక చేసిన ఎంఈవోలు జాబితాను డీఈవోకు పంపించారు. అయితే కొన్ని మండలాల నుంచి నలుగురి జాబితాలో ఉండటం ఆరోపణలకు తావిస్తోంది. ఎంఈవోలు మూడు పేర్లు పంపిస్తే నలుగురి పేర్లు ఎలా వచ్చాయనేది తేలడం లేదు. ఒక ఓ మండలంలోనైతే ఐదుగురి పేర్లు ఉండటం విశేషం. వెల్గటూర్ మండలం నుంచి ఒకేఒక్క ఉపాధ్యాయుడి పేరు ఉంది. అ వార్డు ఎంపికలో ఉపాధ్యాయుల పనితీరు, బోధనలో ప్రత్యేకతను చాటుతున్నవారిని జిల్లా యూ నిట్‌గా పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని విద్యాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ముగ్గురి కన్నా తక్కువ ఎంపికై న మండలాలు ఇవే
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై నవారిలో ముగ్గురికన్నా తక్కువగా ఉన్న మండలాలు ఇలా ఉన్నాయి. వెల్గటూర్‌లో ఒక్కరు, కథలాపూర్‌లో ఇద్దరు, ఎండపల్లిలో ఇద్దరు, పెగడపల్లిలో ఇద్దరు, మెట్‌పల్లిలో ఇద్దరు ఉన్నారు.
పారదర్శకంగా ఎంపిక
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో పైరవీలకు ఆస్కారం ఇవ్వలేదు. పారదర్శంగా జాబితా తయారు చేశాం. మండలాల నుంచి వచ్చిన జాబితాను నిశితంగా పరిశీలించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జాబితాను రూపొందించాం.
– రాము, డీఈవో