
మరమ్మతు చేసినా మూలకే!
తరచూ చెడిపోతున్న బల్దియా వాహనాలు ఇటీవలే రూ.30లక్షలతో బాగు చేయించిన వైనం అయినా కదలనంటూ మొరాయింపు తాజాగా మరో రూ.20లక్షలు కేటాయింపు వృథా అవుతున్న ప్రజాధనం
జగిత్యాల బల్దియా స్వరూపం
టెండర్లు వేస్తున్నాం
ఈ చిత్రంలో కనిపిస్తున్నవన్నీ బల్దియా వాహనాలే. పూర్తిగా నిరుపయోగంగా మారుతున్నాయి. మరమ్మతుకు నిధులు వెచ్చిస్తున్నారు తప్ప బాగుచేయించిన తర్వాత పనులు కొనసాగించలేకపోతున్నారు. ఇందులో ఆంతర్యమిమేటో అధికారులకే తెలియాలి. ప్రతీ వాహనాన్ని ఇలాగే నిర్లక్ష్యంగా వదిలేస్తుండడంతో పట్టణంలో పారిశుధ్యం లోపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
జగిత్యాల: ‘రాజుల సొమ్ము రాళ్లపాలు..’ అన్న చందంగా జగిత్యాల మున్సిపాలిటీ పరిస్థితి తయారైంది. ప్రజల సొమ్మునంతా వాహనాల పాలు చేస్తున్నారు. మరమ్మతుకు వస్తే వాటిని మూలనపడేయడం.. కొన్నింటిని షెడ్లకు తరలించి చేతులు దులుపుకోవడం చేస్తున్నారు తప్ప.. వినియోగంలోకి మాత్రం తేవడం లేదు. చిన్నపాటి మరమ్మతు ఉన్నప్పుడే రిపేర్ చేయిస్తే వాహనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, అవి శిథిలావస్థకు చేరిన అనంతరం రూ.లక్షల్లో బిల్లు పెడుతున్నారు బల్దియా అధికారులు. చివరి దశలో వాటికి రిపేరు చేయించడం ద్వారా అవి మళ్లీమళ్లీ చెడిపోతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో ప్రధానమైన డోజర్, బ్లేడ్ ట్రాక్టర్, స్వీపింగ్ మిషన్ మరమ్మతుల్లోనే ఉన్నాయి. గతేడాది కూడా వీటి మరమ్మతుకు రూ.10 లక్షలు కేటాయించారు. అవి మరమ్మతు అయ్యాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ వాహనాలన్నీ ఇప్పుడు రిపేరులోనే ఉన్నాయి. స్వీపింగ్ మిషన్‌ను రూ.50 లక్షలతో కొనుగోలు చేయగా వృథాగా ఉంది.
మరమ్మతుకు వస్తే మూలకు
పారిశుధ్య వాహనాలు మరమ్మతుకు గురైతే వెంటనే బాగు చేయిస్తే అందుబాటులోకి వస్తాయి. కానీ అధికారుల నిర్లక్ష్యమో.. పట్టింపులేని ధోరణోగానీ.. రేకుల షెడ్డుకే పంపిస్తున్నారు. మరోవైపు బల్దియాలో పారిశుధ్యం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
కరీంనగర్‌కు వెళ్లిన వాహనాలు అటే..
ఏడాది క్రితం పారిశుధ్య నిర్వహణ కోసం బీఎస్–6 ఆటోలు కొనుగోలు చేశారు. సుమారు 16 ఆటోలను తీసుకొచ్చారు. ఇందులో కొన్ని మరమ్మతుకు రావడంతో కరీంనగర్‌కు పంపించారు. అవి ఇప్పటి వరకు జగిత్యాలకు తీసుకురాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. వాటిని తెప్పించాలంటే గతంలో బిల్లు పెట్టిన అధికారులే మళ్లీ పెట్టాలని.. తాము పెట్టే అవకాశం లేదని ప్రస్తుతమున్న అధికారులు చెబుతూ జాప్యం చేస్తున్నారు. వాటిని బల్దియాకు తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
48 వార్డుల్లో లోపిస్తున్న పారిశుధ్యం
జగిత్యాల బల్దియాలో 48వార్డులున్నాయి. లక్షకు పైగా జనాభా ఉంది. వాహనాలు మరమ్మతులో ఉండటంతో పారిశుధ్య నిర్వహణ సమస్యగా మారింది. ఆటోలు, బ్లేడ్ ట్రాక్టర్లు, స్వీపింగ్ మిషన్లు, ఫాగింగ్ మిషన్లు సక్రమంగా లేకపోవడంతో పారిశుధ్యం నామమాత్రంగా మారింది.
లెక్క తేలని రూ.30లక్షలు
వాహనాల మరమ్మతును బల్దియాలోని ఇంజినీరింగ్ విభాగం అధికారులు చూస్తుంటారు. వాహనాల ఖర్చు కింద బడ్జెట్‌లో రూ.10 లక్షలు కేటాయిస్తారు. ఇలా ఇప్పటివరకు రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. కానీ.. వాహనాలు మాత్రం మళ్లీ మరమ్మతుకు రావడంతో అసలు మరమ్మతు చేయిస్తున్నారా..? లేదా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తే లెక్కలు తేలుతాయి. తాజాగా మళ్లీ మరమ్మతు కోసం సుమారు రూ.15 లక్షల వరకు కేటాయించారు. ప్రస్తుతం వీటికి టెండర్లు పిలవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
వార్డులు 48
ట్రాక్టర్లు 12
ఆటోలు 46
ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్ 1
స్వీపింగ్ మిషన్ 1
టిప్పర్ 1
వాహనాల మరమ్మతులకు టెండర్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కరీంనగర్‌లో ఉన్న వాహనాలకు బిల్లులు చెల్లించి తెప్పించేలా చూస్తున్నాం. పారిశుధ్య నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం.
– అనిల్, ఏఈ
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్. ఇది మరమ్మతుకు రావడంతో కొత్తబస్టాండ్‌లోని వాటర్‌ట్యాంక్ సమీపంలో పెట్టారు. అక్కడ చెట్ల పొదలు దట్టంగా పెరిగాయి. అందులోనే ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా వదిలేశారు. మున్సిపల్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

మరమ్మతు చేసినా మూలకే!

మరమ్మతు చేసినా మూలకే!