
ముచ్చటగా మూడు లక్షల మంది!
కోరుట్ల: జిల్లా జనాభా దాదాపు 9 లక్షలు.. వీరిలో మూడో వంతు అంటే సుమారు 3 లక్షల మంది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానంలో పాలపంచుకోవడం విశేషం. పదిరోజుల పాటు గణేశ్ ఉత్సవాలు ఉత్సాహంగా సాగిన నేపథ్యంలో రోజూ వినాయక మండపాల నిర్వాహకులు ఎక్కడికక్కడే అన్నదానాలతో అలరించారు.
మూడువేల మండపాలు
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి పట్టణాలతో పాటు మండలాల్లో సుమారు 3 వేల వినాయక మండపాలు అధికారిక లెక్కల ప్రకారం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో 500 మండపాలు ఉంటాయని అంచనా. వీధివీధికి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయని కాస్త మెలకువతో వ్యవహరించిన రాజకీయ నాయకులు యువతను చేరదీసి కొత్తగా మండపాలు ఏర్పాటు చేయించి గ్రామాల్లో తమ ఉనికి చాటుకునేందుకు యధాశక్తి ప్రయత్నించారు. ఈ క్రమంలో నిర్వాహకులు ఎక్కడా తగ్గలేదు. ఓ వీధిలో ఓ యువత అన్నదానం నిర్వహిస్తుందంటే దానికి దీటుగా మరో మండపాల నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ లెక్కన జిల్లాలో సుమారు 2,500 వినాయక మండపాల నిర్వాహకులు ఈ పది రోజుల వ్యవధిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కో అన్నదాన కార్యక్రమంలో ఎంత తక్కువ అనుకున్నా వెయ్యి నుంచి 1,200 మంది భక్తులు పాలుపంచుకున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఈ పది రోజుల వ్యవధిలో సుమారు 3 లక్షల మంది అన్నదానంలో పాల్గొన్నారంటే అతిశయోక్తి కాదు. చిన్న చిన్న గ్రామాల్లో కొన్ని సందర్భాల్లో వినాయక మండపం వద్ద అన్నదానం ఉందంటే ఇళ్లలో పొయ్యి వెలగలేదు.
నిర్వహణ.. యువతకు శిక్షణ
వినాయక మండపాల ఏర్పాటు పది రోజుల పాటు ఉత్సవాల నిర్వహణతో యువతకు పరోక్షంగా కొన్ని నైపుణ్యాల్లో శిక్షణకు ఉపకరించింది. మొదటగా స్వయంగా మండపాల ఏర్పాటు యువకుల్లో సమష్టి కార్యాచరణపై అవగాహన పెంపొందించింది. మండపాల్లో ముగ్గులు, పాటల పోటీలు తదితర సమావేశాల ఏర్పాటు, వాటి పర్యవేక్షణ వంటి అంశాల్లో యువతకు కొంత అవగాహన వచ్చింది. అన్నదాన కార్యక్రమాలతో ఏదైనా కార్యక్రమాన్ని ఎలాంటి అంచనాలతో ప్రారంభించాలి, అకస్మాత్తుగా వచ్చే అవసరాలకు ఎలా సిద్ధంగా ఉండాలన్న అంశాలపై యువతకు అవగతం కావడం గమనార్హం. మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణ, ఖర్చులు, నిధుల సమీకరణ వంటి అంశాలు యువకుల్లో భవిష్యత్‌లో చేపట్టే పనులకు సంబంధించిన అనుభవం కల్పించింది. కొన్ని చోట్ల మండపాల్లో సామాజిక సందేశాలను ప్రతిబింబించే అంశాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను అదే రీతిలో తీర్చిదిద్దడం యువతలో సామాజిక బాధ్యతను మేల్కోలిపే దిశలో ముందడుగు పడుతుందనడంలో సందేహం లేదు. మొత్తం మీద వినాయక ఉత్సవాలు గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందిచడంతో పాటు సామాజిక స్పృహ, యువతకు కార్యక్రమాల నిర్వహణపై శిక్షణకు అవకాశం కల్పించింది.