
గణేశ్ నిమజ్జనానికి పటిష్ట భద్రత
● 600 సీసీ కెమెరాలతో నిఘా ● 1,000 మంది పోలీసులతో బందోబస్తు
జగిత్యాలక్రైం: జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవానికి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం జరిగిన ప్రాంతాలతో పాటు, శోభాయాత్ర ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు వెయ్యి మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రధాన కూడళ్లతో పాటు, నిమజ్జన ప్రదేశాల్లో 600 సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిమజ్జనం సజావుగా సాగేందుకు జిల్లా పరిధిలో 24 గంటలు పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, సీఐలు శ్రీనివాస్, అరీఫ్‌అలీఖాన్, కరుణాకర్, రాంనర్సింహారెడ్డి, రవి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
రేపు కొండగట్టు ఆలయం మూసివేత
మల్యాల(చొప్పదండి): చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న మధ్యాహ్నం 12.30గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో శ్రీకాంత్‌రావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆర్జీత సేవలు నిలిపివేస్తామని పేర్కొన్నారు. పుణ్యహవచనం, సంప్రోక్షణ, తిరుమంజనము, ఆరాధన అనంతరం యథావిధిగా సోమవారం ఉదయం 7గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు.

గణేశ్ నిమజ్జనానికి పటిష్ట భద్రత