● పెద్దపల్లి ఎంపీ ఒత్తిడితో దిగివచ్చిన రైల్వేశాఖ
రామగుండం: కొన్నినెలల క్రితం ప్రయాణికుల నుంచి అంతగా స్పందన లేదనే కారణంతో పాటు దాని ముందే ఓ రైలుకు హాల్టింగ్ కల్పించామనే సాకు, వీటన్నింటి కంటే పలు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఎగువ వైపు వెళ్లే క్రమంలో హాల్టింగ్, దిగువ వైపు వెళ్లే వాటికి నాన్‌స్టాప్ ఇలా గందరగోళంగా అర్థం కాని నిర్ణయాలను దక్షిణ మధ్య రైల్వే అమలు చేసింది. దీంతో రామగుండం కేంద్రంగా రాకపోకలు సాగించే ప్రయాణికులు రైల్వేశాఖ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా పలుమార్లు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లి 11 రైళ్లకు హాల్టింగ్స్ కల్పించాలని కోరగా కేవలం ఐదు రైళ్లకు మాత్రమే హాల్టింగ్ కల్పించినట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో రెండు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరగా కేవలం ఒక రైలుకు మాత్రమే హాల్టింగ్ కల్పించారు. గురువారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాల్టింగ్ కల్పించిన రైళ్ల వివరాలను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాల్టింగ్ కల్పించడంపై ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
రామగుండంలో హాల్టింగ్ కల్పించిన రైళ్ల వివరాలు..
రైలు నం.12295 బెంగళూరు–దానాపూర్ (సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్)
రైలు నం.12578 ధర్భాంగా–మైసూర్ (బాగ్‌మతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్)
రైలు నం.12721 హైదరాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ (దక్షిణ్)
రైలు నం.22535 రామేశ్వరం–భరౌణి (రామేశ్వరం)
రైలు నం.22669 ఎర్నాకులం–పాట్నా (పాట్నా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్)
పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు నెం.12722 దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ కల్పించారు.