
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులను ఆదేశించారు. ఇన్‌పేషెంట్లకు సత్వర సేవలందించాలని, అవుట్‌పేషెంట్లలో వ్యాధి లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని, రోగి లక్షణాలను రికార్డు చేయాలన్నారు. ముందస్తుగా వ్యాధి నిర్ధారణ జరిగితే మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వైద్యులు ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ల్యాబ్‌లో వైద్య పరీక్షల వివరాలను, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. ఫార్మసీ విభాగంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా..? లేదా..? తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, రూరల్ తహసీల్దార్ వరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయాలి
ధర్మపురి: గణపతి నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలోని గోదావరి తీర ప్రాంతాలను గురువారం పరిశీలించారు. నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయాలని, విగ్రహాలను లోనికి తీసుకెళ్లడానికి సరిపడా తెప్పలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. రద్దీని నియంత్రించడం, ప్రజల భద్రత వంటి అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, హెల్త్ క్యాంపులు, మంచినీటి సౌకర్యాలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నిమజ్జనం సమయంలో భారీ విగ్రహాలు తీసుకెళ్లే వారికి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులున్నారు.