
బెంబేలెత్తిస్తున్న శునకాలు
● రాయికల్ బల్దియాలో స్వైరవిహారం ● నడుచుకుంటూ వెళ్లున్నవారిపై దాడులు ● భయంతో వణికిపోతున్న వృద్ధులు, చిన్నారులు
రాయికల్: రాయికల్ బల్దియాలో కుక్కల సంచారం రోజురోజుకూ పెరుగుతోంది. కట్టడి చేయాల్సిన మున్సిపల్ అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. శునకాలను చూసి అటువైపు వెళ్లేందుకే బల్దియా ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాయికల్ బల్దియాలో జూన్‌లో 53, జూలైలో 70, ఆగస్టులో 66 మంది కుక్కకాటుకు గురయ్యారు. రెండు రో జుల క్రితం నాలుగేళ్ల చిన్నారి రోడ్డుపై ఆడుకుంటుండగా కుక్కలు ఈడ్చుకెళ్లిన ఘటన కలిచివేసింది.
పట్టణంలో పెరుగుతున్న కుక్కలు
పట్టణంలో ఏ వాడలో చూసినా గుంపులుగుంపులుగా కుక్కలు దర్శనం ఇస్తున్నాయి. వాటిని చూసిన పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో 12 వార్డులు ఉండగా.. సుమారు వెయ్యి కుక్కల వరకు తిరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు మాత్రం 250 మాత్రమే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బల్దియాలోని ఇటిక్యాల క్రాస్‌రోడ్, శివాజీవాడ, కేశవనగర్, ఇందిరమ్మ కాలనీ, కోరుట్ల క్రాసింగ్‌రోడ్, నాగారంవాడ, భీమన్నవాడల్లో ఎక్కడ చూసినా గుంపులుగుంపులుగా కుక్కలు ఉండటంతో చిన్నారులు ఆరుబయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
అంతుచిక్కని రోగంతో..
బల్దియాలో కుక్కలను నియంత్రించే వారు లేరు. పశువైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని కుక్కలు అంతుచిక్కని రోగంతో కనిపిస్తున్నాయి. కొన్ని కుక్కల చర్మం ఊడిపోయి గజ్జి సోకినట్లు ఉంటున్నాయి. ఈ కుక్కలు ఎవరినైనా కరిస్తే తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని, పశువైద్యాధికారులు కుక్కలకు వ్యాక్సినేషన్ వేయాలని కోరుతున్నారు.

బెంబేలెత్తిస్తున్న శునకాలు