
జీపీవోల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
జగిత్యాల: భూభారతి చట్టం పకడ్బందీగా చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామపాలన అధికారుల నియామకాలకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం వీఆర్‌ఏ, వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి వివిధ శాఖల్లో వారిని సర్దుబాటు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇతర శాఖల్లో ఉన్నవారిని మళ్లీ సొంత గూటికి తీసుకొచ్చే క్రమంలో గ్రామపాలన అధికారులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వారికి రాతపరీక్షలు నిర్వహించింది. ఇలా మొత్తం 146 మంది ఉత్తీర్ణత సాధించారు. వారికి ఈనెల 5న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్లు వెల్లడించారు. వారిని పత్రాలు అందుకునేందుకు హైదరాబాద్ పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సమస్యలు తీరుతాయని ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రస్తుతం 300 రెవెన్యూ గ్రామాలు, 218 క్లస్టర్లు ఉన్నాయి. పరీక్ష రాసిన 146 మందితోపాటు ఇతర ప్రాంతాల నుంచి మరో నలుగురు రానున్నారు. వీఆర్‌ఏల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా 84 మందిని నియమించారు. మొత్తం 230 మంది త్వరలోనే పోస్టింగ్‌ల్లో చేరనున్నారు. రెవెన్యూ గ్రామాలను బట్టి ఒక్కో గ్రామ పరిపాలన అధికారికి రెండుమూడు గ్రామాల బాధ్యతలు అప్పగించనున్నారు.
తొలగనున్న ఇబ్బందులు
గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఏ పని ఉన్నా వీఆర్వోలను సంప్రదించేవారు. వారు అవినీతి అక్రమాలకు పాల్పడడంతో ఆ వీఆర్వో వ్యవస్థను గత ప్రభుత్వం తొలగించింది. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఏదైనా పని ఉంటే ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రైతుల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారింది. భూభారతి చట్టం అమలుల్లోకి రావడంతో సమస్య పరిష్కారం కావాలంటే గ్రామపరిపాలన అధికారులు తప్పకుండా ఉండాలన్న ఉద్దేశంతో వారిని మళ్లీ యథాస్థానాలకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం వీరందరినీ విధుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో గ్రామీణప్రాంతాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
అప్పుడే పైరవీలు..
భూభారతి చట్టం అమలులో కీలకంగా మారనున్న గ్రామ పరిపాలన అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తున్న నేపథ్యంలో అప్పుడే పైరవీలు మొదలైనట్లు సమాచారం. దగ్గర ప్రాంతాల్లో వేయించుకోవాలని ఎమ్మెల్యేలు, సన్నిహితులుగా ఉన్న వారి దగ్గరకు వెళ్తున్నట్లు తెలిసింది.
డివిజన్ రెవెన్యూ
గ్రామాలు క్లస్టర్లు
జగిత్యాల 190 130
కోరుట్ల 53 45
మెట్‌పల్లి 57 43
అలాట్‌మెంట్ జీపీవోలు 146
జూ.అసిస్టెంట్లు 230
టోటల్ క్లస్టర్లు 218
మొత్తం రెవెన్యూ విలేజెస్ 300
146 మంది అర్హత
జిల్లా నుంచి జీపీవో పరీక్ష రాసి 146 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈనెల 5న వారంతా కలెక్టరేట్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. భూభారతి చట్టం పకడ్బందీగా అమలు కావాలంటే వీరి నియామకంతో సులువుగా ఉంటుంది. వారికి త్వరలోనే పోస్టింగ్‌లు ఇవ్వనున్నాం.
– సత్యప్రసాద్, కలెక్టర్