
తప్పని యూరియా తిప్పలు
కోరుట్ల/జగిత్యాల: యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం కోరుట్ల మండలం మాదాపూర్, అయిలాపూర్ గ్రామాల్లో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. మాదాపూర్ పీఏసీఎస్‌కు ఉదయం 10గంటల సమయంలో 460బస్తాల యూరియాతో లారీ వచ్చింది. అందులో 230 బస్తాలు మాదాపూర్‌లో.. మిగిలిన 230 బస్తాలు రాయికల్ మండలం భూపతిపూర్‌లో దించాల్సి ఉంది. మాదాపూర్ రైతులు తమకు యూరియా సరిపోవడం లేదని, తమ వద్దనే మొత్తం దింపాలంటూ ఆందోళనకు దిగారు. ఇక్కడి నుంచి లారీని వెళ్లనివ్వబోమని అడ్డుకున్నారు. సుమారు గంటన్నరపాటు లారీని వెళ్లనివ్వలేదు. కోరుట్ల ఎస్సై చిరంజీవి రైతులకు నచ్చజెప్పడంతో లారీ భూపతిపూర్‌కు వెళ్లింది. అయిలాపూర్‌లో బందోబస్తు మధ్య యూరియా పంపిణీ కొనసాగింది.
పొరండ్లలో పంపిణీ నిలిపివేత
రైతులకు యూరియా కష్టాలు ఇంకా తప్పడం లేదు. దీంతో ఎక్కడ యూరియా వచ్చినా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం రాత్రి జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల సహకార సంఘానికి 200 యూరియా బస్తాలు రాగా ఉదయం సుమారు 500 మంది రైతులు క్యూకట్టారు. కానీ 50 బస్తాల పంపిణీ కాగానే సాంకేతిక సమస్యతో బయోమెట్రిక్ విధానం నడవకపోవడంతో యూరియా పంపిణీ నిలిపివేశారు. దీంతో రైతులు చాలా మంది యూరియా దొరుకక నిరాశతో వెనుదిరిగారు.