
నిమజ్జనం ప్రశాంతంగా పూర్తికావాలి
అవాంఛనీయ సంఘటనలు జరగనీయొద్దు కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ జిల్లాలోని పలు చెరువుల పరిశీలన
జగిత్యాల/ధర్మపురి/కోరుట్ల/మెట్‌పల్లి: గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. జిల్లాకేంద్రంలోని చింతకుంట చెరువుతోపాటు ధర్మపురిలోని రాయపట్నం వద్ద గోదావరినది, కోరుట్ల పట్టణ శివారులోని పెద్దవాగు, మెట్‌పల్లి శివారులోని వట్టివాగును మంగళవారం పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం భారీకేడ్స్ ఏర్పాటు చేయాలని, అవసరమైన క్రేన్లు, తెప్పలను సిద్ధంగా ఉంచాలన్నారు. రద్దీని నియంత్రించాలని, ప్రజల భద్రతపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. శానిటేషన్, హైమాస్ట్ లైట్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శోభా యాత్ర సమయంలో విద్యుత్ షాక్‌కు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. రూట్‌మ్యాప్ ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఎత్తైన విగ్రహాల తరలింపును ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. చెరువుల్లో నీటిమట్టం ఎక్కువగా ఉన్నందున గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వారి వెంట జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్‌రెడ్డి, శ్రీనివాస్, జగిత్యాల, కోరుట్ల డీఎస్పీలు రఘుచందర్, రాములు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి బల్దియా కమిషనర్లు స్పందన, రవీందర్, మోహన్ ధర్మపురి, కోరుట్ల సీఐలు రాంనర్సింహరెడ్డి, సురేశ్‌బాబు పాల్గొన్నారు.