పేకాట.. రోజుకో చోట

- - Sakshi

● మామిడి తోటలు, గెస్ట్‌హౌస్‌లు, గోదావరి తీరం, అటవీ ప్రాంతాలే అడ్డాలు ● సిట్టింగ్‌ ఫీజు కింద రూ.లక్షల్లో దండుకుంటున్న నిర్వాహకులు ● జిల్లాలో పరిస్థితి

కోరుట్ల: పట్టణ శివారులోని అయిలాపూర్‌ రోడ్‌లో ఓ మామిడి తోట.. రెండు బ్యాచ్‌ల్లో సుమారు 21 మంది పేకాటరాయుళ్లు.. ఒక బ్యాచ్‌లో రూ.10 వేలు సిండికేట్‌.. మరో బ్యాచ్‌లో రూ.5 వేలు సిండికేట్‌ చొప్పున పేకాట సాగింది. ఈ రెండు బ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 101 పాయింట్లకు 10 నుంచి 12 ఆటలు ఆడారు. మొత్తం కలెక్షన్‌ రూ.15 లక్షలు. దీంట్లో పేకాట ఆడించిన వాళ్లు సిట్టింగ్‌ ఫీజు కింద రూ.1.50 లక్షలు వసూలు చేశారు. ఇలా జగిత్యాల జిల్లాలో ప్రతీరోజు అడ్డగోలుగా సాగుతున్న పేకాటలో సిట్టింగ్‌ ఫీజు కింద నిర్వాహకులు ఎంత తక్కువ అనుకున్నా రూ.50 లక్షలు దండుకోవడం గమనార్హం. ఇక పేకాటలో చేతులు మారుతున్న సొమ్ముకు లెక్క చెప్పలేని పరిస్థితి.

నిత్యం అడ్డాల మార్పు..

పేకాట నిర్వాహకులు సిట్టింగ్‌ ఫీజు కింద వసూలు చేస్తున్న డబ్బులతో ఆటగాళ్లకు బీరు, బిర్యానీ, కోరిన మందు తెప్పించడానికి అయ్యే ఖర్చులు, పోలీసుల బెడద లేకుండా చూడటానికి ముగ్గురు, నలుగురు సెంట్రీల ఏర్పాటుకు, కొన్ని సందర్భాల్లో పోలీసులను మేనేజ్‌ చేస్తామని చెప్పి మరీ కలెక్షన్‌ చేస్తున్నట్లు సమాచారం. పేకాట రాయుళ్లతో రెగ్యులర్‌ టచ్‌లో ఉండే నిర్వాహకులు మధ్యాహ్నం వేళ ఆసక్తి ఉన్నవాళ్లకు ఫోన్లు చేసి మరీ రమ్మంటారు. వచ్చేటప్పుడు కనీసం రూ.10 వేలు వెంట తెచ్చుకోవాలని చెబుతారు. నిత్యం అడ్డాలు మార్చుతూ ఆటగాళ్లు అక్కడికి చేరేందుకు లోకేషన్లు షేర్‌ చేస్తుండటం విశేషం.

సెంట్రీల సమాచారంతో..

పేకాట నిర్వాహకులు రోజూ అడ్డాలు మార్చుతూ పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని జగిత్యాల–రాయికల్‌ పరిసరాల్లోని మామిడితోటలు, ధర్మపురి గోదావరి తీరం, కోరుట్ల పట్టణ శివారులోని అయిలాపూర్‌, కోనరావుపేట రోడ్‌లతోపాటు పట్టణంలోని ఒకటి, రెండు గెస్ట్‌హౌస్‌ల్లో, మెట్‌పల్లి–ఇబ్రహీంపట్నం రోడ్డులోని మామిడితోటలు, రాయికల్‌, మల్లాపూర్‌ మండలాల సరిహద్దుల్లో ఉన్న నిర్మల్‌ జిల్లాలోని చినబెలాల్‌, కడెం పరిసరాల్లో, కథలాపూర్‌–రుద్రంగి శివారులోని అటవీ ప్రాంతాల్లో పేకాట జోరుగా సాగుతున్నట్లు సమాచారం. రోడ్ల వెంట ఎవరు వస్తున్నారు.. అనుమానాస్పదంగా ఉన్నారా..? అన్న విషయాలను సెంట్రీలు ఎప్పటికప్పుడు నిర్వాహకులకు తెలియజేస్తారు. పోలీసులు పట్టుకునేందుకు వెళ్లినా సెంట్రీలు ఇచ్చిన సమాచారంతో వెంటనే అడ్డాను మార్చేస్తున్నారు.

కరువైన నియంత్రణ..

ఆరు నెలల క్రితం కథలాపూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి పేకాటకు బానిసై పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. చివరికి ఇంటికి వెళ్లకుండా లాడ్జీల్లో ఉన్నాడు. అతని భార్య అప్పటి ఎస్పీకి పేకాటపై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసు యంత్రాంగం అప్రమత్తమై పెద్ద ఎత్తున పేకాట నియంత్రణకు చర్యలు తీసుకుంది. మామిడి తోటలు, అటవీ ప్రాంతాల్లో సోదాలు చేసి, పేకాటరాయుళ్లను పట్టుకొని, డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో పేకాటపై నియంత్రణ కరువవడంతో జోరుగా సాగుతోంది.

తనిఖీలు చేస్తున్నాం..

పేకాట నియంత్రణకు ఎప్పటికప్పుడు తని ఖీ లు చేస్తున్నాం. మామిడితోటలు, అటవీ ప్రాంతాలపై నిఘా పెట్టాం. పేకాటపై సమాచారం ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

– రవీందర్‌రెడ్డి, డీఎస్పీ, మెట్‌పల్లి

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top