దక్షిణ కరోలినాలో ఊహించని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సరస్సు ఒడ్డున ఉన్న ఒక రెస్టారెంట్ ఆరుబయటి ప్రాంగణంలో తన భర్తతో కలిసి భోజనం చేస్తున్న ఒక మహిళ అనూహ్యంగాప్రాణాలు కోల్పోయింది. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న ఆమె జీవితం క్షణాల్లో గాల్లో కలిసిపోయింది. మృత్యువు ఎపుడు? ఎలా? ముంచుకొస్తుందో తెలియదు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం.
బాధితురాలు హ్యూగర్‌కు చెందిన 56 ఏళ్ల డానా వీంగర్. ఈమె తన భర్తతో కలిసి 'లేక్ మేరియన్' (Lake Marion) వద్ద ఉన్న డ్రిఫ్ట్‌వుడ్ గ్రిల్ (Driftwood Grill) రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా, అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా బలమైన గాలులు తీవ్రమవ్వడంతో, ఆ గాలుల తాకిడికి ఆరుబయటి ప్రాంగణంలోని ఒక బరువైన ప్యాటియో గొడుగు (Patio Umbrella) ఊడిపోయి బాధితురాలిని బలంగా తాకింది. అత్యవసర సహాయక బృందాలు చేరుకునే సమయానికే ఆమె ప్రాణాలు విడిచింది.
క్లారెండన్ కౌంటీ కరోనర్ జాక్వెలిన్ బ్లాక్‌వెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గొడుగు డైనా తల, మెడ భాగంలో బలంగా తాకడంతో తీవ్రమైన గాయమైంది. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాండర్స్ (EMS) ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను బ్రతికించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. క్లారెండన్ గొడుగు బలంగా తగలడం వల్ల ఆమె మెడలోని ప్రధాన రక్తనాళం (Carotid Artery) తెగిపోవడంతోనే మరణం సంభవించినట్టు అంచనా వేశారు.
తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అవుట్‌డోర్ ఫర్నిచర్ భద్రతా ప్రమాణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి బుధవారం (మే 27) పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
రెస్టారెంట్ స్పందన
ఈ ఊహించని ప్రమాదంపై 'డ్రిఫ్ట్‌వుడ్ గ్రిల్' రెస్టారెంట్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేసింది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల జరిగిన ఈ ఘోర ప్రమాదం తమను ఎంతగానో కలచివేసిందంటూ బాధితకుటుంబానికి సానుభూతి ప్రకటించింది. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయం చేసిన ఎమర్జెన్సీ సిబ్బందికి, స్థానికులకు ధన్యవాదాలు తెలిపింది.
ఇదీ చదవండి: 3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్ ఆరోపణలు


