ఇస్లామాబాద్: పశ్చిమాసియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొనసాగుతున్న చర్చల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల కోసం అమెరికా నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరైన సందర్భంలో.. ఇరాన్–అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ధరించిన వేషధారణ ప్రత్యేక చర్చకు దారి తీసింది.
అమెరికా-పాక్ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆసిమ్ మునీర్ వ్యహరశైలి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చర్చాంశనీయంగా మారింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ నేతృత్వంలోని 71 మంది సభ్యుల ఇరాన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికే సమయంలో మునీర్ యుద్ధ దుస్తులు (కామోఫ్లేజ్ కాంబాట్ డ్రెస్)లో కనిపించారు. అయితే, కొన్ని గంటల తర్వాత నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేరుకున్నప్పుడు, మునీర్ పూర్తిస్థాయి సూట్ ధరించి హాజరయ్యారు
ఆశ్చర్యంగా ఆసిమ్ మునీర్ తీరు
విదేశీ నాయకులను కలిసేటప్పుడు సైనికాధికారి ఎల్లప్పుడూ యూనిఫాంలో ఉండాలి. కానీ ఆసిమ్ మునీర్ మాత్రం అమెరికన్లతో తాను దౌత్యవేత్తగా.. ఇరాన్‌తో సైనికుడిగా ఉన్నానని చూపిస్తున్నారని, ఆసిమ్ మునీర్ తీరు సరైంది కాదని సీనియర్ ఆర్మీ జనరల్ ప్రవర్తనకు తగనిది’ అని రిటైర్డ్ మేజర్ జనరల్ సంజయ్ మెస్టన్ తెలిపారు.
ఇరాన్‌తో సమావేశంలో యుద్ధ దుస్తులు ధరించడం ద్వారా మునీర్ సైనిక శక్తిని ప్రదర్శించాలనే సంకేతం ఇచ్చారని రక్షణ నిపుణులు విశ్లేషించారు. ఇటీవల ఇరాన్–పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, క్షిపణి దాడుల నేపథ్యం ఈ నిర్ణయానికి కారణమని వారు భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా ప్రతినిధులతో సమావేశంలో సూట్ ధరించడం ద్వారా తాను కేవలం సైనికాధికారి మాత్రమే కాకుండా దౌత్యవేత్తగానూ ఉన్నానని చూపించుకోవాలనుకున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది ఆయన రాజకీయ ఆశయాలను ప్రతిబింబిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశాల్లో కూడా మునీర్ సూట్ ధరించడమే గమనార్హం. ట్రంప్ ఆయనను తన ‘ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్’ అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి.
2024లో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌పై దాడి చేసింది. బలూచ్ వేర్పాటువాద సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అల్–అదల్ లక్ష్యంగా చేసుకుంది. ఇదే గ్రూప్ ఇరాన్‌లోని సిస్తాన్ ప్రావిన్స్ స్వతంత్రత కోసం పోరాడుతోంది. కొన్ని రోజుల్లోనే పాకిస్థాన్ కూడా ప్రతిగా ఇరాన్ సిస్తాన్–బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచ్ మిలిటెంట్లపై దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతలు చివరికి చైనా జోక్యంతో తగ్గాయి. అయినప్పటికీ, ఇరాన్–పాకిస్థాన్ సంబంధాలు అప్పటి నుంచి స్థిరంగా లేవు. అమెరికా వైపు చూస్తే, ఆసిమ్ మునీర్ సూట్ ధరించడం ద్వారా తాను కేవలం సైనిక నాయకుడే కాకుండా దౌత్యవేత్తగా కూడా ఉన్నానని చూపించుకోవాలనుకున్నాడు. ఇది ఆయన రాజకీయ ఆశయాలను స్పష్టంగా తెలియజేస్తోందని రక్షణ నిపుణుడు సందీప్ ఉన్నితన్ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో మునీర్ తన శక్తి సామర్ధ్యాలేమిటో ప్రపంచానికి, అలాగే పాకిస్థాన్ ప్రజలకు మరో సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా ఇరాన్ విదేశాంగ మంత్రి లేదా అమెరికా ఉపాధ్యక్షుడి వంటి ఉన్నతాధికారులను స్వాగతించేది పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి లేదా విదేశాంగ మంత్రి కావాలి. కానీ ఈసారి మునీర్ ముందుకు రావడం అందుకు ఊతంగా నిలుస్తోంది.
జేడీ వాన్స్‌తో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ, నవ్వుతూ, మాట్లాడుతున్న మునీర్ దృశ్యాలు కేవలం ప్రొజెక్షన్ కోసం అని నిపుణులు చెబుతున్నారు. ‘పాకిస్థాన్‌లో సైన్యం ఆధిపత్యం వహిస్తుంది. అసిమ్ మునీర్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎక్కడైనా ఆయన కనిపిస్తారు. తానే నిర్ణయాలు తీసుకుంటానని స్వయంగా చెప్పకనే చెబుతున్నారని తెలుస్తోంది.
రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శాంతి చర్చల్లో పాల్గొంది.


