మానవ సంబంధాలపై ‘గ్యాస్‌ లైటింగ్‌’.. అసలు ఏంటి ఇది?

What Is Gaslighting: Be Careful With Gaslighting - Sakshi

ఇది ఆత్మ విశ్వాసాన్ని అణచివేసి లొంగదీసుకోవడమే.. 

ప్రస్తుత ఏడాది నిఘంటువులో అత్యధికంగా వెదికిన పదం ఇదే 

మానవ సంబంధాలపై ‘గ్యాస్‌ లైటింగ్‌’తో ప్రతికూల ప్రభావం 

రాజకీయాలు మొదలు అన్నిరంగాల్లోనూ దీని ప్రయోగం 

గ్యాస్‌ లైటింగ్‌తో జాగ్రత్త 

దొడ్డ శ్రీనివాసరెడ్డి: ఒకరంటే మరొకరికి పడదు.. లేదా ఒకరి నుంచి మరొకరు ఏదో కూడని దాన్ని ఆశిస్తున్నాంటారు. దగ్గరివారిగా నటిస్తారు, ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తారు. కానీ అదే సమయంలో మీ నిర్ణయాలు తప్పని మీకే అనిపించేలా వ్యవహరిస్తారు. మెల్లగా మీలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. అవతలివారు ఏం చెప్పినా.. అది తప్పు అని మీకు అనిపిస్తున్నా కూడా తు.చ. తప్పకుండా చేసే పరిస్థితి కల్పిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే.. పూర్తిగా లొంగదీసుకుంటారు. ఇదే ‘గ్యాస్‌ లైటింగ్‌’. పేరులోని పదాలకు సంబంధం లేకున్నా.. నమ్మకమే పెట్టుబడిగా ప్రస్తుతం సమాజంలో అంతటా, అన్ని రంగాల్లో గ్యాస్‌ లైటింగ్‌కు పాల్పడటం కనిపిస్తోంది. 

విప్రో సంస్థ ఇటీవల అకస్మాత్తుగా 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న కారణంగా వారిని తొలగించినట్టు సంస్థ చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ప్రకటించారు. దీనితో మూన్‌ లైటింగ్‌ అనే పదం విస్తృతంగా ప్రాచుర్యంలోకి వ­చ్చింది. ఇప్పు­డు ఇంకో పదం ప్రపంచ ప్రజానీకాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే గ్యాస్‌ లైటింగ్‌. మెరి­యం వెబ్‌స్టర్‌ డిక్షనరీ 2022లో అత్యధికంగా అన్వేషించిన పదంగా గ్యాస్‌ లైటింగ్‌ను ప్రకటించింది.

గత ఏడాది­తో పోలిస్తే ఆ పదం కోసం వెదికినవారి సంఖ్య 1,740 శాతం పెరిగినట్టు మెరి­యం వెబ్‌స్టర్‌ ఎడిటర్‌ పీటర్‌ సాకోలోవిస్కీ తెలిపారు. ఈ పదం పట్ల ప్రజల ఆసక్తికి ఏ సంఘటనో, పరిణామ­మో కార­ణం కాకపోయినా.. ఏడాది పొడ­వు­నా ఔత్సా­హికులు డిక్షనరీలో దీని­కోసం వెద­కడం ఆశ్చ­ర్యం కలి­గించిం­దని చెప్పారు. మెరి­యం వెబ్‌స్టర్‌ నిఘం­టు­వును ఆన్‌లైన్‌లో ప్రతి­­నెలా ప­ది­కోట్ల మంది వీక్షిస్తా­రు. 2020లో పాండమిక్, గత ఏడాది వాక్సి­న్‌ పదాలను అత్యధికంగా శోధించారు. 

మరి ఏమిటీ గ్యాస్‌ లైటింగ్‌? 
వెబ్‌స్టర్‌ డిక్షనరీ ప్రకారం.. ఎవరైనా సుదీర్ఘకాలంపాటు వారి వాదనలు, వక్రీకరణలతో మనల్ని గందరగోళపర్చడం, మనపై మనకే నమ్మ­కం కోల్పో­యే­లా చే­య­డం, వాస్తవికత­పట్ల సందేహం కల్పిం­చడం, మానసికంగా మన­ల్ని ఆత్మ­న్యూనతలోకి నెట్టడమే ‘గ్యాస్‌ లైటింగ్‌’. సులువుగా చెప్పుకోవాలంటే అవతలివా­రు త­మ స్వార్థ ప్రయోజనాల కోసం మనల్ని తప్పుదోవ పట్టించడం అన్నమాట. ఫేక్‌­న్యూస్, వా­ట్సాప్‌లో అవాస్తవాల ప్రచారం, ప్రజలను ప్రభుత్వాధినేతలు మభ్యపెట్టడం, కుట్ర సిద్ధాంతాల వంటివాటి నేపథ్యం­లో ఇటీవలి కాలంలో ‘గ్యాస్‌ లైటింగ్‌’ పదం విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 

గ్యాస్‌ లైటింగ్‌కు మూలం ఇదీ! 
తొలుత ఎక్కువగా మానసిక నిపుణులు గ్యాస్‌ లైటింగ్‌ పదాన్ని వాడేవారు. తర్వాత సాహిత్యంలో, పత్రికా రచనల్లో అప్పుడప్పుడూ కనిపించేది. ఇప్పుడు దీన్ని అన్ని రంగాల్లో ప్రస్తావిస్తున్నారు. అయితే గ్యాస్‌ లైటింగ్‌ పదానికి మూలం 84 ఏళ్ల క్రితం లండన్‌లో అదే పేరుతో ప్రదర్శితమైన నాటకం. 1938లో పాట్రిక్‌ హమిల్టన్‌ రాసి­న నాటకం ‘గ్యాస్‌ లైట్‌’ అప్పట్లో విపరీతమైన ప్రజాదరణ పొందింది.

ఆ నాటకం ఆధారంగా 1944లో గ్యాస్‌ లైట్‌ పేరుతో ప్రముఖ నటీనటులు ఇంగ్రిడ్‌ బెర్గ్‌మన్, చార్లెస్‌ బోయెర్‌ నటించిన సినిమా విడుదలయింది. కథానాయిక బెల్లా పాత్రను బెర్గ్‌మన్, ఆమె భర్త జాన్‌ పాత్రను బోయ­ర్‌ పోషించారు. భార్య బెల్లాకు మానసిక స్థిమితం లేదనే భావనను ఆమెలో కలిగించడానికి భర్త జాక్‌ చేసే ప్రయత్నాలే దీని­లో ప్రధానాంశం. భార్య ఆత్మన్యూనతకు లోనయ్యేలా భర్త ప్రయత్నించేటప్పుడు ఇంట్లో గ్యాస్‌తో వెలిగేలైట్లు మసకబారుతూ ఉంటాయి. 

మన చుట్టూ గ్యాస్‌ లైటింగ్‌.. 
తరచిచూస్తే మన చుట్టూ ఈ గ్యాస్‌ లైటింగ్‌ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అబద్ధాలు, వక్రీకరణలు, తిమ్మిని బమ్మిని చేయడం వంటివాటిని మానవ సంబంధా­ల్లో, వ్యాపారం, రాజకీయం వంటి అన్నిరం­గాల్లో చూస్తూనే ఉంటాం. నమ్మకం ఉన్నచోటే గ్యాస్‌ లైటింగ్‌ పనిచేస్తుంది. భార్యాభర్తలు, ప్రేమికులు, స్నేహితుల మధ్య, యజమాని–ఉద్యోగి మధ్య, రాజకీ­య నేతలు–ఓటర్ల మధ్య నిరంతరాయంగా ఇదిసాగుతూ ఉండటం గమనిస్తున్నాం

►లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాను ఓడిపోలేదని, కుట్ర జరిగిందని అను­యా­యులను నమ్మించి పార్లమెంట్‌ భవనం కాపిటల్‌హిల్‌పై దాడికి కారణమయ్యారు. ప్రత్యర్థి బరాక్‌ ఒబామా అమెరికాలో పుట్టలేదని దేశప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు ట్రంప్‌. ఒబామా తన బర్త్‌ సర్టి­ఫికెట్‌ చూపించి ట్రంప్‌ చెప్పింది అబద్ధమని నిరూపించుకోవాల్సి వచ్చింది. 

►కరోనా ముట్టడిస్తున్నప్పుడు అన్నిదేశాల ప్రభుత్వాలు తేలిగ్గా తీసుకుని ప్ర­జ­లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశా­యి. వైద్య సంస్థలు మొదట్లో అదే పనిచేశాయి. మహమ్మారి పంజా విసిరి లక్షల మందిని పొట్టనపెట్టుకున్నాక చర్య­లు తీసుకోవడం మొదలుపెట్టా యి. కరోనా సమయంలో ప్రభుత్వా­లు, వైద్య సంస్థలు వాస్తవాలను దాచి­పెట్టడానికి చేసిన ప్రయత్నాలకు ‘మెడికల్‌ గ్యాస్‌ లైటింగ్‌’ అని పేరుపెట్టారు. 

►నల్లధనాన్ని అరికట్టడానికి నోట్ల రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించినప్పుడు అందరూ నమ్మారు. గంటలు, రోజుల తరబడి క్యూలలో నిలబడి నగదు మార్చుకున్నారు భారతీయ బడుగుజీవులు. తీరా చూస్తే రద్దు ముందు చెలామణిలో ఉన్న నగదు కన్నా ఎక్కువ శాతం నగదు చెలామణిలోకి వచ్చింది. తర్వాత ప్రధానిగానీ, ప్రభుత్వంగానీ నోట్లరద్దు ప్రస్తావన చేయలేదు. ఇలా ప్రభుత్వాధినేతలు, రాజకీయ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడాన్ని ‘పొలిటికల్‌ గ్యాస్‌ లైటింగ్‌’గా పిలుస్తున్నారు.  

శ్రద్ధావాకర్‌ హత్య కేసులోనూ ఇదే తీరు!
సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధావాకర్‌ హత్యకేసులో కూడా గ్యాస్‌ లైటింగ్‌ జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. అఫ్తాబ్‌ పూనావాలా తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధను హత్యచేసి, దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పడేసిన ఉదంతం గురించి విస్తృతమైన చర్చ జరిగింది. మరి అంతకుముందు శ్రద్ధావాకర్‌ చేసిన పోలీస్‌ ఫిర్యాదు, స్నేహితులతో పంచుకున్న తన అనుమానాలు, ఆందోళనలను పరిశీలిస్తే.. అఫ్తాబ్‌ ప్రవర్తన గురించి, అతడి దుశ్చర్యల గురించి తెలిసినా శ్రద్ధావాకర్‌ అఫ్తాబ్‌ను ఎందుకు వదిలి వెళ్లలేదన్నది సమాధానం లేని ప్రశ్న.

శ్రద్ధపై అఫ్తాబ్‌ ‘గ్యాస్‌ లైటింగ్‌’ ప్రయోగించడమే దీనికి కారణమనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రముఖ క్లినికల్‌ సైకాలజిస్టు డాక్టర్‌ ప్రాచీ వైష్‌ను ఇదే సందేహం అడిగితే.. ‘‘ఇలాంటి కేసుల్లో నిందితులు సుదీర్ఘకాలం పాటు బాధితులను మానసికంగా గందరగోళపర్చి, ఆత్మన్యూనతకు లోనుచేసి, మానసిక స్థితిపై పూర్తి నియంత్రణ సాధిస్తారు. దీనితో బాధితులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. తప్పించుకుని వెళ్లే సాహసం చేయరు..’’ అని చెప్పారు. 

బయటపడేదెలా? 
గ్యాస్‌ లైటింగ్‌ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కావాల్సింది ప్రధానంగా ఆత్మ నిబ్బరాన్ని కోల్పోకపోవడమేనని మానసిక నిపుణులు చెప్తున్నారు. మనపై గ్యాస్‌ లైటింగ్‌ జరుగుతుందని ఏమాత్రం అనుమానం వచ్చినా.. తక్షణమే ఎలాంటి నిర్ణయాలు, అభిప్రాయాలకు రాకుండా మౌనంగా పరిస్థితిని పరిశీలించుకోవాలని.. వాస్తవాలను ఒకటికి రెండుసార్లు పరిక్షించుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైన ఆధారాలను సేకరించాలని.. ఇతరులతో అనుమానాలను పంచుకోవాలని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా పరిస్థితిని ఎదుర్కొని, ప్రత్యామ్నాయాలను యోచించాలని.. అవసరమైతే నిపుణులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top