రూ.1,856 కోట్ల నిఘా డ్రోన్‌ కనిపించుట లేదు | USA Rs 1,800 crore drone goes missing during secret mission in Hormuz | Sakshi
Sakshi News home page

రూ.1,856 కోట్ల నిఘా డ్రోన్‌ కనిపించుట లేదు

Apr 11 2026 4:20 AM | Updated on Apr 11 2026 4:20 AM

USA Rs 1,800 crore drone goes missing during secret mission in Hormuz

హార్మూజ్‌పై సీక్రెట్‌ ఆపరేషన్‌ సందర్భంగా అదృశ్యం

అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ  

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. నావికాదళానికి చెందిన అత్యంత ఖరీదైన నిఘా డ్రోన్‌ను అగ్రరాజ్యం కోల్పోయినట్టు సమాచారం. గురువారం హార్మూజ్‌ జలసంధి సమీపంలో గగనతలంలో సీక్రెట్‌ మిషన్‌ సందర్భంగా ఉదంతం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎంక్యూ–4సీ ట్రైటాన్‌గా పిలిచే ఈ డ్రోన్‌ ఖరీదు ఏకంగా 20 కోట్ల డాలర్లు (రూ.1,856 కోట్లు) కావడం గమనార్హం. రాడార్ల నుంచి హఠాత్తుగా అదృశ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. ప్రస్తుతానికి కనిపించడం లేదు. 

ఎంక్యూ–4సీ ప్రమాదవశాత్తూ డ్రోన్‌ కూలిపోయిందా? లేక ఇరాన్‌ సైన్యం కూల్చివేసిందా? అనేది నిర్ధారణ కాలేదు. ఈ నిఘా డ్రోన్‌ను 2018లో అమెరికా సైన్యంలో ప్రవేశపెట్టారు. యుద్ధంలో కోల్పోవడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా ఇప్పటికే భారీగా నష్టపోయింది. ఎఫ్‌–15ఇ, ఎ–10 వంటి ఆధునిక యుద్ధ విమానాలు నేలకూలాయి. ఎంక్యూ–4సీను కోల్పోవడంతో ఆ నష్టం మరింత పెరుగుతోంది. తొమ్మిది ఎంక్యూ–9 రీపర్‌ డ్రోన్లను కూడా అమెరికా నష్టపోయింది. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం అమెరికాకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది.  

డ్రోన్‌ నుంచి అత్యవసర సంకేతం  
ఎంక్యూ–4సీ డ్రోన్‌ ఆచూకీ కోసం అమెరికా సైన్యం గాలిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదు. హార్మూజ్‌ జలసంధిపై మూడు గంటల మిషన్‌ తర్వాత ఈ డ్రోన్‌ ఇటలీ దేశం సిగోనెల్లాలోని తన స్థావరానికి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయింది. అదృశ్యమయ్యే ముందు అత్యంత వేగంగా కిందికి దిగినట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా చూపుతోంది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 50 వేల అడుగుల ఎత్తు నుంచి 10 వేల అడుగుల ఎత్తుకు దిగినట్లు చెబుతోంది. 

అత్యంత అధునాతనమైన మానవరహిత నిఘా డ్రోన్లలో ఒకటైన ఎంక్యూ–4సీ ట్రైటాన్‌ తొలుత సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించి ఆకస్మికంగా ఇరాన్‌ వైపు మళ్లింది. రాడార్‌ నుంచి అదృశ్యమయ్యే ముందు 7700 అనే కోడ్‌ను పంపించింది. ఇది ఒక అత్యవసర సంకేతం. అయితే, ఆ అత్యవసర పరిస్థితి ఏమిటన్నదానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అసలు హార్మూజ్‌ గగనతలంలోకి నిఘా డ్రోన్‌ ఎందుకు వెళ్లిందన్నది తెలియరాలేదు. పర్షియల్‌ గల్ఫ్‌ చుట్టుపక్కల పర్యవేక్షణ కోసం అమెరికా నావికాదళం గత నెల రోజులుగా ఎంక్యూ–4సీ ట్రైటాన్‌ను ఉపయోగిస్తోంది.

 కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకరోజు ముందు ఈ నెల 7వ తేదీన ఈ డ్రోన్‌ ఇరాన్‌లోని ఖర్గ్‌ ఐలాండ్‌పై చక్కర్లు కొట్టిందని చెబుతున్నారు. గతవారం ఎఫ్‌–15ఇ ఫైటర్‌ జెట్‌ను ఇరాన్‌ కూల్చివేసిన తర్వాత సహాయక చర్యల్లో డ్రోన్‌ పాలుపంచుకుంది. ఇది సాధారణ డ్రోన్‌ కాదు. సుదీర్ఘ కాలంపాటు సముద్ర నిఘా, పర్యవేక్షణ కోసం రూపొందించారు. 24 గంటలపాటు గాల్లో ఆగకుండా ఎగరగలదు. అమెరికా సైన్యానికి తురుపుముక్క లాంటి డ్రోన్‌ అదృశ్యం కావడం, ఇప్పటికీ ఆచూకీ లేకపోవడం మిస్టరీగా మారింది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement