
పాలస్తీనాను దేశంగా గుర్తించాలన్న ఫ్రాన్స్ నిర్ణయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా తప్పుబట్టాయి. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇప్పటికే ఈ నిర్ణయం తీసేసుకోగా.. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే..
మాక్రోన్ నిర్ణయాన్ని ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా ఖండించాయి. ఇది అక్టోబర్ 7వ తేదీ నాటి బాధితులకు ద్రోహం చేయడంలాంటిదేనని అమెరికా విదేశాంగ కార్యదర్శి మాక్రో రుబియో అన్నారు. మాక్రోన్ నిర్ణయాన్ని సిగ్గుచేటుగా పేర్కొన్న రుబియో.. ఇది హమాస్‌కు అనుకూలంగా ఉందంటూ మండిపడ్డారు.
ఐరాస సాధారణ అసెంబ్లీలో పాలస్తీనాకు దేశం గుర్తింపు కోసం ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేస్తున్న ప్రయత్నాలు ఖండించదగ్గవి. 2023 అక్టోబవర్ 7వ తేదీన ఇస్లామిక్ గ్రూప్ హమాస్ దాడులతోనే గాజాకు ఈ పరిస్థితి వచ్చింది. అలాంటి సంస్థకు మద్దతుగా ఫ్రాన్స్ నిర్ణయం ఉంది. ఇది సిగ్గుచేటు అని రుబియో ట్వీట్ చేశారు.
The United States strongly rejects @EmmanuelMacron’s plan to recognize a Palestinian state at the @UN general assembly.
This reckless decision only serves Hamas propaganda and sets back peace. It is a slap in the face to the victims of October 7th.— Secretary Marco Rubio (@SecRubio) July 25, 2025
మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ పాలస్తీనాకు దేశం గుర్తింపు ఇవ్వడమంటే.. అది ఉగ్రవాదానికి బహుమతి ఇచ్చినట్లేనని అన్నారు. పైగా ఇది ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే అంశమేనని అభిప్రాయపడ్డారాయన.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 142 దేశాలు పాలస్తీనాకు దేశం గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే యూరప్ దేశం నుంచి ఈ డిమాండ్ చేస్తున్న పవర్‌ఫుల్ దేశంగా ఇప్పుడు ఫ్రాన్స్ ఈ జాబితాలో నిలిచింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తీవ్ర మానవ సంక్షోభం తలెత్తడంపై ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు దాడులు.. మరోవైపు సాయం అందకుండా ఈ పరిస్థితికి ఇజ్రాయెల్ కారణమైందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది(ఫ్రాన్స్ కూడా ఇదే గళం వినిపిస్తోంది). అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. ఈ తరుణంలో ఫ్రాన్స్ నిర్ణయం ఆసక్తికర పరిణామాలకు దారి తీసే అవకాశం లేకపోలేదు.