
అక్రమ వలసదార్ల కోసం కొనసాగుతున్న వేట
వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నవారి కోసం వేట కొనసాగుతోంది. చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని గుర్తించి, వెనక్కి పంపించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అమెరికాలోని జార్జియాలో 475 మంది అక్రమవలసదార్లను నిర్బంధించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి స్టీవెన్ ష్రాంక్ శుక్రవారం వెల్లడించారు. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ కంపెనీ ప్లాంట్ ఉంది.
ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తుంటారు. ఇందులో దక్షిణ కొరియా పౌరులు అక్రమంగా పని చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. తాజాగా నిర్బంధంలోకి తీసుకున్నవారి అక్రమ వలసదార్లతో ఎక్కువ మంది దక్షిణ కొరియా పౌరులే ఉన్నట్లు స్టీవెన్ ష్రాంక్ తెలిపారు. జార్జియాలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు స్థానికులకు దక్కాలి తప్ప అక్రమంగా వలసవచ్చినవారు సొంతం చేసుకోవడం సరైంది కాదని అన్నారు.
ఒకేచోట 475 మంది అదుపులోకి తీసుకోవడం హోంల్యాండ్ సెక్యూరిటీ ఆపరేషన్ల చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికాలో తమపౌరులను అక్కడి అధికారులు నిర్బంధించినట్లు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది. అయితే, ఎంతమంది అనే విషయం బయటపెట్టలేదు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు సోదాలు ముమ్మరంచేశారు. ప్రధానంగా విదేశీయులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.