ఇరాన్‌పై చరిత్రలోనే క్లిష్టమైన సైనిక ఆపరేషన్‌కు ట్రంప్‌ భారీ ప్లాన్‌? | US sends 10,000 more troops to Middle East | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై చరిత్రలోనే క్లిష్టమైన సైనిక ఆపరేషన్‌కు ట్రంప్‌ భారీ ప్లాన్‌?

Apr 15 2026 9:51 PM | Updated on Apr 15 2026 9:54 PM

US sends 10,000 more troops to Middle East

వాషింగ్టన్‌: చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు, ఇరాన్‌పై యుద్ధంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌లో యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి భూతల దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకవైపు యుద్ధం ముగుస్తుందంటూ వ్యాఖ్యానిస్తూనే, మరోవైపు ఇరాన్‌పై మరిన్ని దాడులకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది.

అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నివేదికల ప్రకారం.. ఇరాన్ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను ఇస్ఫాహాన్‌లోని భూగర్భ స్థావరాల్లో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఆ యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సైనిక ఆపరేషన్ చేపట్టనున్నారని సమాచారం. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా పశ్చిమాసియాలో 10 వేల మంది సైనికులను పంపింది. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న వేళ ఈ సైనిక చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ ఏప్రిల్ నెలలోనే 10 వేలకుపైగా సైనికులు ఆ ప్రాంతానికి చేరుకోనున్నారు. వీరిలో 6 వేల మంది సైనికులు ప్రస్తుతం నమీబియా తీరానికి సమీపంలో ఉన్న అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ (CVN-77) ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగమవుతారు. మరో 4,200 మంది సైనికులు బాక్సర్ అంఫిబియస్ రెడీ దళంలో చేరి, ఏప్రిల్ చివరి నాటికి అక్కడికి చేరుకోనున్నారు. ఈ గ్రూప్‌లో 800కి పైగా మెరైన్లు, హెలికాప్టర్లు, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లు ఉన్నాయి.

అమెరికా రక్షణ అధికారులు మాట్లాడుతూ, ఇరాన్‌లో భూసైనిక చర్యల కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో ప్రత్యేక దళాలను ఇరాన్ భద్రపరిచిన యురేనియంను వెలికితీయడం, భద్రపరచడం, అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలోని దీవులు, తీరప్రాంతాల్లో ల్యాండింగ్ ఆపరేషన్లు చేయడం వంటి అంశాలు ఉన్నాయి.

ఇదే సమయంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఇరాన్ యుద్ధం చాలా త్వరలో ముగియబోతోంది. వచ్చే రెండు రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఆయన, కాల్పుల విరమణను పొడిగించాల్సిన అవసరం లేదని, యుద్ధం త్వరలోనే ముగుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.

ఈ పరిణామాలు, ఇరాన్‌తో అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదని సూచిస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ ‘యుద్ధం ముగుస్తోంది’ అని చెబుతున్నా, మరోవైపు అమెరికా భారీగా సైనిక బలగాలను సమీకరిస్తోంది. ఇది కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టం కావచ్చని సంకేతాలు ఇస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement