పశ్చిమాసియాలో మళ్లీ సెగలు | US military has carried out new strikes in Iran targeting a military site | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియాలో మళ్లీ సెగలు

May 29 2026 12:57 AM | Updated on May 29 2026 12:57 AM

US military has carried out new strikes in Iran targeting a military site

ఇరాన్‌పై మరోసారి దాడికి దిగిన అమెరికా  

బందర్‌ అబ్బాస్‌లో సైనిక స్థావరంపై క్షిపణులు  

నాలుగు ఇరాన్‌ అటాక్‌ డ్రోన్లు కూల్చివేత  

కువైట్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ ప్రతీకార దాడి 

వాషింగ్టన్‌/దుబాయ్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌ సైనిక స్థావరంపై బుధవారం రక్షణాత్మక దాడికి దిగినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అంతకుముందు ఇరాన్‌ అటాక్‌ డ్రోన్లను కూల్చివేశామని పేర్కొంది.

 హార్మూజ్‌ జలసంధి పరిసరాల్లో ముప్పుగా పరిణమించిన నాలుగు ఇరాన్‌ వన్‌–వే దాడి డ్రోన్లను అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ దళాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. బందర్‌ అబ్బాస్‌లోని ఇరాన్‌ గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్‌పై అమెరికా దళాలు క్షిపణులు వర్షం కురిపించాయి. ఐదో డ్రోన్‌ను ప్రయోగించడానికి ఇరాన్‌ జవాన్లు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది.  

ఒప్పందం దగ్గర్లోనే ఉంది  
ఇరాన్‌ సైనిక శక్తి చాలావరకు క్షీణించిందని, అందుకే తమతో చర్చలకు ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. బుధవారం కేబినెట్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి తొందరేమీ లేదని చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నప్పటికీ ఇరాన్‌తో ఒప్పందం విషయంలో తాము తొందరపడడం లేదన్నారు. అయితే, అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందం దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. 

అలాగైతే ఒమన్‌ను పేల్చేస్తాం: ట్రంప్‌  
హార్మూజ్‌ జలసంధిని నియంత్రించడానికి ఒమన్‌ సహా ఏ ఒక్క దేశాన్ని కూడా అనుమతించబోమని డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే కొత్త ఒప్పందంలో భాగంగా.. ఇరాన్, ఒమన్‌ కలిసి హార్మూజ్‌ గుండా జరిగే రవాణాను నియంత్రిస్తాయంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆ జలసంధిని ఎవరూ కంట్రోల్‌ చేయలేరని అన్నారు. అవి అంతర్జాతీయ జలాలు అని గుర్తుచేశారు.ఒమన్‌ కూడా అందరిలాగే ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు. లేకపోతే మనం ఒమన్‌ను కూడా పేల్చివేయాల్సి వస్తుందని తేల్చిచెప్పారు.  

కువైట్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ దాడి  
అమెరికాపై ఇరాన్‌ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే, వీటిని కువైట్‌ గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా సైనిక వర్గాలు గురువారం స్పష్టంచేశాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించాయి. తమ భూభాగంపై దాడి జరిగిందని కువైట్‌ ప్రకటించింది. అయితే, తమపై తొలుత దాడిచేసినందుకు ప్రతీకారంపై ఓ గల్ఫ్‌ దేశంలో అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్‌ తేల్చిచెప్పింది. ఒమన్‌కు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒమన్, అమెరికా మిత్రదేశాలు. అమెరికా సైనిక కార్యక్రమాలకు ఒమన్‌ సహకరిస్తోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య నిశ్శబ్ద మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వచ్చింది.  

ప్రాథమిక ఒప్పందం సిద్ధం 
డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదమే తరువాయి  
వాషింగ్టన్‌:  కాల్పుల విరమణను పొడిగించడం, ఇరాన్‌ అణు కార్యక్రమంపై చర్చలను తిరిగి ప్రారంభించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్‌లు ఒక ప్రాథమిక ఒప్పందానికి 
వచ్చినట్లు సమాచారం. అయితే, ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తుది ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అంగీకరిస్తే ప్రాథమిక ఒప్పందం అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇరుపక్షాల ప్రతినిధులు ఇటీవలే 60 రోజుల అవగాహన ఒప్పందం ముసాయిదాపై అంగీకారానికి వచ్చారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే పశ్చిమాసియాలో అతిపెద్ద దౌత్యపరమైన పురోగతిగా నిలిచే అవకాశం ఉంది. 

అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ దాడులు జరుగుతున్న తరుణంలో కాల్పుల విరమణ ఏ క్షణంలోనైనా కుప్పకూలవచ్చనే భయాందోళనలు పెరిగాయి. అయినప్పటికీ ఇరుపక్షాలు ప్రాథమిక ఒప్పందానికి రావడం విశేషం. ఇందులో చాలా అంశాలు మంగళవారం నాటికే ఖరారయ్యాయని అమెరికా అధికారులు తెలిపారు. తమ ఉన్నతస్థాయి నాయకుల నుంచి ఆమోదం పొందామని ఇరాన్‌ ప్రతినిధులు సైతం పేర్కొన్నారు. దీనిపై తన నిర్ణయం ఏమిటన్నది ఇంకా డొనాల్డ్‌ ట్రంప్‌ బయటపెట్టలేదు. ఒప్పదం ముసాయిదాలోని వివరాలను వైట్‌ హౌస్‌ ధ్రువీకరించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement