వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు.
“మీడియా అక్కడే ఉండాలి.. ఎందుకంటే వచ్చే 2 రోజుల్లో ఏదో జరిగే అవకాశం ఉంది. మేము అక్కడికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నాం” అని ట్రంప్ చెప్పారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, శాంతి చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప‍్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా ఇవాళ మధ్యాహ్నం పేర్కొంది. ఇటీవల పాక్‌లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్ భావిస్తున్నాయి. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్ తిరిగి ఇస్లామాబాద్ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.
పాకిస్థాన్‌లోని సోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండో దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్‌తో పాక్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. “మేము ఇరాన్‌తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.
పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార‍్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి.


