ఒప్పందానికి చేరువలో.. | US has a complex relationship with Iran, including Strait of Hormuz | Sakshi
Sakshi News home page

 ఒప్పందానికి చేరువలో.. 

May 25 2026 4:50 AM | Updated on May 25 2026 4:50 AM

US has a complex relationship with Iran, including Strait of Hormuz

అమెరికా– ఇరాన్‌ ఒప్పందం ఖరారు!  

అమెరికా షరతులకు ఇరాన్‌ అంగీకారం  

యురేనియం వదిలించుకోవడానికి సిద్ధం 

హార్మూజ్‌ తెరవడానికి గ్రీన్‌సిగ్నల్‌  

సమయం అనుకూలంగా ఉంది  

ఒప్పందానికి తొందరొద్దని చెప్పా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి 

వాషింగ్టన్‌/కైరో/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కల్లోలానికి తెరదించి.. శాంతి, స్థిరత్వం నెలకొల్పడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. యుద్ధాన్ని ముగించి, హార్మూజ్‌ జలసంధిని తిరిగి తెరిచి, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఇరాన్‌ వదులుకునేలా చేసే ఒప్పందానికి అమెరికా చాలా చేరువలోకి వచ్చేసిందని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని పేర్కొన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వెల్లడించాయి. అణ్వాయుధ పరీక్షలకు దూరంగా ఉండాలని, శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, దీనికి ఇరాన్‌ ఇప్పటిదాకా బహిరంగంగా అంగీకరించలేదు.  

ఆ నిజాన్ని ఇరాన్‌ అర్థం చేసుకోవాలి
ఇరాన్‌తో ఇప్పందం చాలావరకు కుదిరిందని ట్రంప్‌ శనివారం ప్రకటించారు. ఈ విషయంలో భాగస్వా మిగా ఉన్న మిత్రదేశాలతో మాట్లాడానని చెప్పారు. ‘‘ఇరాన్‌తో చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. సమయం మనకు అనుకూలంగా ఉన్నందున, ఒప్పందానికి తొందరపడవద్దని నా ప్రతినిధులకు తెలియజేశా. ఇరు పక్షాలు కొంత సమయం తీసుకుని సరైన నిర్ణయానికి రావాలి. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలి’’అంటూ ఆదివారం సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 

ఇరాన్‌తో అమెరికా సంబంధాలు మరింత ఫలవంతంగా మారుతున్నాయని ఉద్ఘాటించారు. ఒప్పందం కుదిరి, ధ్రువీకరించబడి, సంతకం చేసే వరకూ ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇజ్రాయెల్, అరబ్‌ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందంలో చేరాలని ఇరాన్‌ను ట్రంప్‌ ఆహ్వానించారు. అయితే, అణ్వాయుధాన్ని లేదా బాంబును అభివృద్ధి చేయలేమని లేదా సమకూర్చుకోలేమన్న నిజాన్ని ఇరాన్‌ అర్థం చేసుకోవాలన్నారు. 

మరికొన్నిగంటల్లో శుభవార్త: రూబియో  
ఇరాన్‌తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. రాబోయే కొన్ని గంటల్లోనే శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్‌తో ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా ప్రకటన చేస్తారని సంకేతాలిచ్చారు. రూబియో ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధిత ముసాయిదాపై గత 48 గంటల్లో జరిగిన చర్చల్లో పురోగతి సాధించామని పేర్కొన్నారు. కానీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇరాన్‌ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండకూడదనేదే అంతిమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదన్నారు.

ఒప్పందంలో ఏముంది?  
→ ఇరాన్‌ వద్ద ప్రస్తుతం 440.9 కిలోల(972 పౌండ్లు) యురేనియం ఉంది. ఇది 60 శాతం వరకు శుద్ధత కలిగినది. అణ్వాయుధ తయారీకి 90% శుద్ధి చేసిన యురేనియం అవసరం.  
→ అమెరికాతో ఒప్పందంలో భాగంగా ఈ యురేనియంను వదులుకోవడానికి ఇరాన్‌ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.  
→ ఇరాన్‌ యురేనియంను ఎలా వదులుకుంటుందనే విషయం 60 రోజుల వ్యవధిలో జరిగే తదుపరి చర్చలకు లోబడి ఉంటుందని చెబుతున్నారు.  
→ యురేనియంలో కొంత భాగాన్ని నిర్వీర్యం చేస్తారు. మిగిలినదాన్ని మూడో దేశానికి బదిలీ చేస్తారు. ఈ యురేనియంను స్వీకరించడానికి రష్యా ముందుకొచ్చింది.  
→ హార్మూజ్‌ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడానికి, సుంకాలు లేకుండా నౌకాయానికి వీలు కల్పించడానికి ఇరాన్‌ అంగీకరించింది.  
→ ఒప్పందం కుదిరినట్లేనని అమెరికా వర్గాల సమాచారం. దానిపై ఇంకా సంతకాలు జరగలేదు. ట్రంప్‌ ఆమోదం లభించాల్సి ఉందని, కొన్ని రోజులు పట్టవచ్చని అంటున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement