
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల కారణంగా అక్కడ నివాసం ఉంటున్న వారు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు అమెరికాను వీడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక, తాజాగా ఓ కుటుంబానికి ఊహించని పరిస్థితి ఎదురైంది. 35ఏళ్లుగా అమెరికాలోనే నివాసం ఉంటున్న ఓ జంటను అధికారులు.. అమెరికా నుంచి పంపించేశారు. అక్రమంగా నివాసముంటున్నారనే కారణంతో వారిని దేశం నుంచి వెళ్లగొట్టారు.
వివరాల ప్రకారం.. కొలంబియాకు చెందిన గ్లాడీస్ గొంజాలెస్ (55), నెల్సన్ గొజాలెస్ (59) దంపతులు దాదాపు 35ఏళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉన్నారు. వీరిద్దరూ అక్కడే ముగ్గురు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. ఎటువంటి నేరచరిత్ర లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, ఇటీవల అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ జంట వద్ద సరైన పత్రాలు లేవని తేలింది. దీంతో, వారిని.. అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం, కొన్ని రోజులు నిర్బంధంలో ఉంచారు. మూడు వారాల అనంతరం చివరకు స్వదేశానికి తరలించారు. ఈ క్రమంలో చేసేదేమీ లేక సదరు జంట.. కన్నీరు పెట్టుకుంటూ అమెరికాను వీడారు.
ఈ ఘటనపై వారి కుమార్తెలు స్పందించారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో తాము షాక్‌కు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తమ తల్లిదండ్రులు ఇక్కడే జీవిస్తూ, సామాజిక సేవలో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి నిర్ణయాలు వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఘాటు విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా.. అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న విదేశీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కార్ భారీ డిపోర్టేషన్ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని వెనక్కి పంపించేస్తున్నారు. ఇక, భారత్‌కు చెందిన వారిని కూడా ఇప్పటికే స్వదేశానికి తరలించిన విషయం విధితమే.