అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(79) తన మనసులోని మాట బయటపెట్టారా?. ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్నారా?. జపాన్ పర్యటనకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యల ఆంతర్యం అదేనంటూ చర్చ నడుస్తోంది ఇప్పుడు.
వైట్‌హౌజ్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ తాజాగా ట్రంప్ మూడో దఫా పోటీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. జపాన్ పర్యటనకు బయల్దేరే ముందు విమానం(Air Force One) వద్ద మీడియా ఆయన్ని ఆ వ్యాఖ్యలపై ప్రశ్నించింది. దానికి ట్రంప్ స్పందిస్తూ.. ‘‘మూడోసారి పోటీ చేయడం నాకు ఇష్టమే. నా వద్ద అత్యుత్తమ నెంబర్లు ఉన్నాయి’’ అంటూ బదులిచ్చారు. అయితే..
ఆ వెంటనే ‘‘ఇంకా ఆ విషయంపై నిజంగా ఆలోచించలేదు’’ అని అన్నారు. ట్రంప్ తన తరువాత రిపబ్లికన్ పార్టీని నడిపే నాయకులుగా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్లను ప్రస్తావించారు. మా వద్ద గొప్ప నాయకులు ఉన్నారు అంటూ రుబియో వైపు చూపిస్తూ.. ‘వాళ్లలో ఒకరు ఇక్కడే ఉన్నారు’ అని చమత్కరించారు. అలాగే.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ప్రశంసిస్తూ.. అవును, జేడీ అద్భుతంగా ఉన్నాడు. ఉపాధ్యక్షుడు గొప్పవాడు. వీళ్లిద్దరిని ఎదుర్కొనే వారు ఉండరేమో అని ట్రంప్ అన్నారు.
అమెరికాకు అధ్యక్ష ఎన్నికలు 2028 సంవత్సరంలో జరగనున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి అధ్యక్ష పదవికి రెండుసార్లు మాత్రమే ఎన్నిక కావచ్చు. మూడోసారి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధం.
అయితే స్టీవ్ బానన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్రంప్ 2028లో మూడోసారి అధ్యక్షుడిగా అవుతారు. దీనికి ఒక ప్రణాళిక ఉంది. కఠినమైన అడ్డంకే ఉన్నా.. దాన్ని అధిగమించే మార్గాలు ఉన్నాయి. 2016, 2024లో ట్రంప్ సాధించారు. వచ్చేసారి కూడా సాధించగలరు అని అన్నారు.
గతంలో ఫ్రాక్లిన్ డి రూజ్‌వెల్ట్ అమెరికాకు నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా పని చేశారు. అయితే.. 1951లో రాజ్యాంగానికి 22వ సవరణ (22nd Amendment) ద్వారా రాటిఫై చేశారు.
ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే, అమెరికా రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే, అత్యధిక రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇది రాజకీయంగా చాలా కష్టమైన ప్రక్రియ. ఇది ప్రస్తుతం సాధ్యపడే అవకాశాలు లేవు. స్టీవ్ బానన్, ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీసేలా ఉన్నా.. న్యాయపరంగా అవి అమలులోకి రావడం అసాధ్యం.
ఇదిలా ఉండగా.. ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ మలేషియా నుంచి జపాన్ చేరుకున్నారు. సోషల్ ట్రూత్‌లో ఈ మేరకు.. మలేషియా అద్భుతమైన దేశం. ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలు, రేర్ ఎర్త్ డీల్స్ సంతకం చేశాం. ముఖ్యంగా థాయ్‌లాండ్ మరియు కంబోడియా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. యుద్ధం లేదు! కోట్లాది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇది చేయడం గౌరవంగా ఉంది. ఇప్పుడు జపాన్‌కు బయల్దేరా అని పోస్ట్ చేశారు.


