మైక్రోసాఫ్ట్‌ ఎక్చేంజ్‌ హ్యాకింగ్‌ చైనా పనే! 

US Allies Accuse China of Microsoft Exchange Hack - Sakshi

అమెరికా ఆరోపణ 

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ ఎక్చేంజ్‌ ఈమెయిల్‌ సర్వర్‌ హ్యాకింగ్‌లో చైనా పాత్ర ఉందని అగ్రరాజ్యం ఆరోపించింది. ఈ సర్వర్‌ హ్యాకింగ్‌తో ప్రపంచంలోని పలు కంప్యూటర్లలో సమాచార భద్రతపై అనుమానాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే! ఇలాంటి సైబర్‌ బెదిరింపులకు బీజింగ్‌ మూలస్థానమని, అక్కడ నుంచి పలువురు ప్రభుత్వ మద్దతున్న హ్యాకర్లు ప్రముఖ కంపెనీల సైట్లను హ్యాక్‌ చేసి భారీగా డబ్బులు డిమాండ్‌ చేశారని బైడెన్‌ ప్రభుత్వం, అమెరికా మిత్రదేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా స్టేట్‌ సెక్యూరిటీ మంత్రి ఇలాంటి క్రిమినల్‌ కాంట్రాక్ట్‌ హ్యాకర్లను వాడుతున్నాడని, వీరు హ్యాకింగ్, హైటెక్‌ దొంగతనాల్లాంటివి చేస్తున్నారని బైడెన్‌ ప్రభుత్వంలో సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

మరోవైపు చైనాకు చెందిన నలుగురిపై అమెరికా న్యాయశాఖ హ్యాకింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై కేసులు పెట్టింది. వీరంతా పలు యూనివర్సిటీలు, కంపెనీలు, ప్రభుత్వ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడ్డారని ఆరోపించింది. ఒకపక్క రష్యాకు చెందిన సిండికేట్లు అమెరికా మౌలిక సదుపాయాలపై సైబర్‌ దాడులు చేస్తున్న తరుణంలో మరోవైపు చైనా నుంచి ఇలాంటి దాడులు ఎదురుకావడం బైడెన్‌ ప్రభుత్వానికి గడ్డు సమస్యగా మారింది. ప్రస్తుత ఆరోపణలతో చైనాపై ఎలాంటి ఆంక్షలు పెట్టకున్నా, చైనా దౌత్య అధికారులను పిలిచి ఈ విషయమై సీరియస్‌గా హెచ్చరించినట్లు తెలిసింది.  

ఈయూ, బ్రిటన్‌ సైతం 
పలు ప్రభుత్వ సంస్థలు, రాజకీయ పార్టీలు, కీలక పరిశ్రమల సైట్లపై చైనా హ్యాకర్లే దాడి చేస్తున్నారని యూరోపియన్‌ యూనియన్, బ్రిటన్‌ సైతం ఆరోపిస్తున్నాయి. చైనా గ్రూపులు ఫిన్లాండ్‌ పార్లమెంట్‌ సహా పలు కీలక సంస్థలపై గురిపెట్టారని యూకే నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ తెలిపింది. చైనా భూభాగం నుంచే ఈ దాడులు జరుగుతున్నాయని, మేథోహక్కుల దోపిడికి హ్యాకర్లు పాల్పడుతున్నారని ఈయూ ప్రతినిధి జోసెఫ్‌ బొర్రెల్‌ చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ ఎక్చేంజ్‌ సైబర్‌ అటాక్‌ చైనా దన్నున్న గ్రూపుల పనేనని యూకే ఫారిన్‌ సెక్రటరీ డొమినిక్‌ రాబ్‌ ఆరోపించారు. నిజానికి ఇలాంటి సీరియస్‌ దాడులకు రష్యా క్రిమినల్‌ గ్రూపులు పెట్టింది పేరు.

పలుమార్లు రష్యా ఇంటిలిజెన్స్‌ సంస్థలకు, హ్యాకర్‌ గ్రూపులకు సంబంధాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే క్రిమినల్‌ కాంట్రాక్ట్‌ హ్యాకర్లను చైనా ప్రభుత్వం నేరుగా వాడుకోవడం ఇటీవలి కాలంలో ముఖ్య పరిణామమని అధికారులు చెప్పారు. జనవరిలో మైక్రోసాఫ్ట్‌ ఎక్చేంజ్‌ హ్యాకింగ్‌ను కనిపెట్టారు. ఈ విషయమై ఎఫ్‌బీఐ, నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇన్‌ఫ్రా సెక్యూరిటీ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇతర దేశాలు చైనా దుశ్చర్యలను ఖండించేందుకు బైడెన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ చైనా కొట్టిపారేస్తోంది. ఆధారాల్లేకుండా ఆరోపణలు వద్దని హెచ్చరించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top