యుద్ధంలో ఊహించని చర్యలకు దిగిన పుతిన్‌.. కరెక్ట్‌ కాదన్న ఉక్రెయిన్‌

Ukraine War: Putin Fast Tracks Russian citizenship To Ukraine Citizens - Sakshi

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఉక్రెయిన్‌పై జరుపుతున్న మిలిటరీ చర్యలో ఊహించని చర్యలకు దిగాడు. ఇప్పటికే పశ్చిమ ప్రాంతం ఖేర్‌సన్‌, ఆగ్నేయ ప్రాతం జాపోరిజ్జియా(జేఫోరిషియ)లను రష్యా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోని పౌరులకు రష్యా పౌరసత్వం కట్టబెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నాడు. 

ఉక్రెయిన్‌ యుద్ధం ద్వారా పూర్తి స్వాధీనంలో ఉన్న ఖేర్‌సన్‌, కొంతభాగం మాత్రమే రష్యా బలగాల ఆధీనంలో ఉన్న జాపోరిజ్జియాలో ఉక్రెయిన్‌ పౌరులకు.. రష్యా పౌరసత్వం ఇచ్చేలా ఆదేశాలపై బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంతకాలు చేశాడు. ఇందుకోసం రష్యా సిటిజన్‌షిప్‌, పాస్‌పోర్ట్‌ చట్టాల సవరణలకు పచ్చజెండా ఊపాడు. తద్వారా మూడు నెలల లోపే దరఖాస్తుదారులకు రష్యా పౌరసత్వం, పాస్‌పోర్టులు దక్కనున్నాయి.

మరోవైపు ఆదేశాలు వెలువడ్డ కాసేపటికే.. అక్కడి ఉక్రెయిన్‌ పౌరులకు పౌరసత్వం ఇచ్చే చర్యలు ఆఘమేఘాల మీద మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. మాస్కో, మాస్కో అనుకూల అధికారులు ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలు రష్యా పరిధిలోకి వస్తాయని ప్రకటించడం గమనార్హం. 

అయితే కీవ్‌ వర్గాలు మాత్రం పుతిన్‌ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఇది ఉక్రెయిన్‌ సరిహద్దు సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే అంశమని వాదిస్తున్నాయి. అక్రమంగా రష్యా పౌరసత్వాన్ని, పాస్‌పోర్టులు కట్టబెట్టడాన్ని ఖండిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మానవత్వ చట్టాలను ఉల్లంఘించడమేనని, పాశ్చాత్య దేశాలు ఈ చర్యను ఖండించాలని పిలుపు ఇచ్చింది. 

ఒకవైపు ఇందులో బలవంతం ఏం లేదని ఖేర్‌సన్‌ రీజియన్‌ అధికారులు(రష్యా) చెప్తున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. సోమవారం ఖేర్‌సన్‌,జాపోరిజ్జియా  అధికారులు.. ఉక్రెయిన్‌ హ్రివ్నియాతో పాటు రూబుల్‌ను(రష్యా కరెన్సీ) కూడా అధికారిక కరెన్సీపై ప్రకటించారు. ఇంతకుముందు రష్యా నుంచి స్వతంత్ర​ రాజ్యాలుగా ప్రకటించబడ్డ ఉక్రెయిన్‌ డోనేత్సక్‌,  లుగాన్స్క్ ప్రాంతాల్లోని అనేక లక్షల మంది నివాసితులు ఇప్పటికే రష్యన్ పాస్‌పోర్ట్‌లను అందుకున్నారు.

చదవండి: ఉక్రెయిన్‌ యుద్ధానికి మూణ్నెల్లు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top