Ukraine-Russia War: యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం

Ukraine-Russia War: Russia wants an end to war in Ukraine says Putin - Sakshi

ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమే: పుతిన్‌

మాస్కో/కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పర్యటనపై రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ఘాటుగా స్పందించారు. ‘‘ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ క్షిపణులు ఇస్తామని అమెరికా చెబుతోంది. మంచిదే. అలాగే కానివ్వండి. ఆ క్షిపణులను సైతం మేము కచ్చితంగా కూల్చేస్తాం’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని మరింత ప్రజ్వరిల్లజేయడానికే అమెరికా ఆయుధాలు ఇస్తోందని ఆరోపించారు. సంఘర్షణను ఇంకా పొడిగించాలన్నదే అమెరికా ఆలోచన అని దుయ్యబట్టారు. పుతిన్‌ తాజాగా మాస్కోలో మీడియాతో మాట్లాడారు.

త్వరగా, మెరుగ్గా యుద్ధాన్ని ముగించాలని తాము కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌తో చర్చలకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని పునరుద్ఘాటించారు. గతంలో సైనిక చర్యలన్నీ సంప్రదింపులతోనే ముగిశాయని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లోని ఘర్షణను ప్రస్తావిస్తూ ‘యుద్ధం’ అనే మాటను పుతిన్‌ ఉపయోగించారు. ఉక్రెయిన్‌లో ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌’ జరుగుతోంది అని ఇన్నాళ్లూ ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. తొలిసారి బహిరంగంగా ‘యుద్ధం’ అని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కొనసాగాలని జెలెన్‌స్కీ, అమెరికా అధికారులు కోరుకుంటున్నారని అమెరికాలో రష్యా రాయబారి అనతొలీ అంటోనోవ్‌ విమర్శించారు.    

స్వదేశంలో జెలెన్‌స్కీపై ప్రశంసలు  
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేపట్టిన అమెరికా పర్యటనపై స్వదేశంలో ప్రశంసల వర్షం కురుస్తుండగా, శత్రుదేశం రష్యాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జెలెన్‌స్కీ పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైందని, అమెరికా నుంచి సాయం రాబట్టడంలో ఆయన ప్రతిభ చాటుకున్నారని ఉక్రెయిన్‌ పౌరులు చెబుతున్నారు. కానీ, ఘర్షణను మరింత రాజేయడానికే జెలెన్‌స్కీ అమెరికా వెళ్లారని రష్యా అధికారులు మండిపడుతున్నారు. చక్కటి ఫలితాలతో తాను అమెరికా నుంచి తిరిగి వెళ్తున్నానని సంతోషం వ్యక్తం చేస్తూ జెలెన్‌స్కీ గురువారం రాత్రి ఒక వీడియో సందేశం విడుదల చేశారు.

అమెరికా సాయం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రష్యాపై పోరాటం సాగిస్తున్న తమకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు, అమెరికా పార్లమెంట్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే, జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై ఉక్రెయిన్‌ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన అమెరికా నుంచి పోలాండ్‌కు చేరుకున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు వస్తారని సమాచారం. తాను, పోలాండ్‌ అధ్యక్షుడు అండ్రెజ్‌ డుడా ఆలింగనం చేసుకుంటున్న ఫొటోను జెలెన్‌స్కీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top