పారిస్: పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి దిగ్బంధం కొనసాగుతుండడంతో ప్రపంచ దేశాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. హార్మూజ్ జలసంధిలో స్వేచ్ఛగా నౌకాయానం చేసుకునే పరిస్థితులు తీసుకురావడానికి ఏకంగా 40 దేశాలు ఏకం కావడానికి ఓ వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది.
హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా 40కి పైగా దేశాలను ఒకే చోటుకు తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్ సంకల్పించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం (ఏప్రిల్ 17న) జరుగుతుందని తెలిపారు. యుద్ధంలో పాల్గొనని దేశాలు దీనికి హాజరవుతాయని పేర్కొన్నారు. ప్రపంచానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా తీసుకునే చర్యలకు సహకరిస్తాయని ఆయన చెప్పారు.
యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఘర్షణ ముగిసిన తరువాత హార్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా చేసేందుకు సమన్వయంగా పాటించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు 40కి పైగా దేశాలతో సమావేశం జరుపుతామని తెలిపారు.
“హార్మూజ్ జలసంధి మూసివేత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖర్చుల ఒత్తిడిని తగ్గించడానికి గ్లోబల్ షిప్పింగ్ తిరిగి ప్రారంభం కావడం కీలకం. నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణ లక్ష్యంతో 40 కంటే ఎక్కువ దేశాలతో యూకే సంప‍్రదింపులు జరుపుతోంది. ఈ వారం యూకే, ఫ్రాన్స్ కలిసి అంతర్జాతీయ షిప్పింగ్ రక్షణకు సమన్వయ, స్వతంత్ర, బహుళజాతీయ ప్రణాళికపై సమావేశం నిర్వహిస్తాయి” అని కీర్ స్టార్మర్ ఎక్స్‌లో తెలిపారు.
మంగళవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ మాట్లాడుతూ... యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు చర్చలను పునఃప్రారంభించాలి, అపోహలను తొలగించాలి, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడాలని కోరారు. అన్ని పక్షాలు కాల్పుల విరమణను గౌరవించాలని చెప్పారు.
“హార్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా మళ్లీ తెరవడం చాలా ముఖ్యం. ఎటువంటి నియంత్రణలు, టోల్‌లు ఉండకూడదు. ప్రధాన భాగస్వాముల మద్దతుతో చర్చలు త్వరగా పునఃప్రారంభం కావాలి” అని ఎమ్మాన్యుయేల్ అన్నారు.
కాగా, పాకిస్థాన్‌లో ఇటీవల 21 గంటల పాటు జరిగిన చర్చల తర్వాత కూడా అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదరలేదన్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్-యూకే ప్రతిపాదన ఇస్లామాబాద్ చర్చల అడ్డంకిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కావడంతో పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.
పాక్‌లో మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (ఏప్రిల్ 14) ప్రకటించారు. రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని, ఇవి కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.


