Covid-19 Cases: టెన్షన్‌ పెడుతున్న కరోనా... యూకే, చైనాలో రికార్డు స్థాయిలో కేసులు

UK And China Has Record No Of Covid-19 Cases - Sakshi

China's Covid caseload hit thousands per day: కరోనా పుట్టినిల్లు చైనాని గత కొన్ని రోజులుగా ఈ మహమ్మారి  హడలెత్తిస్తోంది. గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక  ఒక్కరోజే సుమారు 20 వేల కరోనా కేసులను వెలుగు చూసినట్లు బుధవారం ఒక నివేదిక వెల్లడైంది.

మొత్తానికి జీరో కోవిడ్‌ విధానం దారుణంగా విఫలమై చైనాలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అతి పెద్ద నగరమైన షాంఘైలో ఒమిక్రాన్‌ మ్యుటెంట్‌కి సంబంధించిన కేసులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ సహా అంతర్జాతీయ ప్రయాణాల పైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. పరిస్థితి చేజారిపోనివ్వకుండా ఆర్మీని సైతం రంగంలోకి దించారు. 

చైనాలో తాజాగా.. సుమారు 20,472 కేసులు నమోదైయ్యాయని, కొత్తగా ఎటువంటి మరణాలు సంభవించలేదని జాతీయ ఆరోగ్య కమిషన్‌ పేర్కొంది. ఒక్క షాంఘై నగరంలోనే దాదాపు 80% మేర కరోనా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. పైగా ఈ మహానగరంలో దశల వారీగా లాక్‌డౌన్‌లు విధించకుంటూ పోతుండటంతో నిర్బంధంలో ఉన్న ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తాజాగా బుధవారం షాంఘై మొత్తం జనాభాకి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

యూకేలో ఇమ్యూనిటీ పవర్‌ లేక..
ఈ కరోనా మహమ్మారీ ప్రారంభమైనప్పటి నుంచి గత రెండెళ్లలో లేనివిధంగా ఇంగ్లండ్‌లో మార్చి నెల నుంచి అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.  50 ఏళ్లు పైబడిన వారిలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.2కి సంబంధించిన కేసులు నమోదవుతున్నట్లు ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్ నేతృత్వంలోని రియాక్ట్‌-1 అధ్యయనం పేర్కొంది. ఈ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌కి సంబంధించిన కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నట్లు వెల్లడించింది. అంతేకాదు దాదాపు 90% కేసులే వీటికి సంబంధించినవే.

అలాగే ఆస్పత్రులలో చేరే వారే సంఖ్యకూడా పెరిగే అవకాశం ఉందని రియాక్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ పాల్ ఇలియాట్ తెలిపారు. వ్యాక్సిన్‌లు తీసుకున్నప్పటికీ వ్యాధి నిరోధక శక్తి క్షీణించడంతో 55 ఏళ్ల పైబడినవారే ఈ కొత్త కరోనా వేరియంట్‌ బారిన పడుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. అయితే యూకే జనవరి నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం తగ్గించింది. కానీ రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఈ కేసుల నేపథ్యంలో వ్యాప్తి చెందుతున్న ఆ కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్లను గుర్తించడం కష్టమౌవుతుందని ఇంపీరియల్‌లోని స్టాటిస్టికల్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ క్రిస్టల్ డోన్నెల్లీ ఆందోళన వ్యక్తం చేశారు. 

(చదవండి: చైనాను కలవరపెడుతున్న కరోనా.. జిన్‌ పింగ్‌ సంచలన నిర్ణయం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top