వెంటనే ఇరాన్‌ ఇలా చేయకపోయిందో..: ట్రంప్‌ | Trump warns Iran over truce plan | Sakshi
Sakshi News home page

వెంటనే ఇరాన్‌ ఇలా చేయకపోయిందో..: ట్రంప్‌

Mar 26 2026 7:41 PM | Updated on Mar 26 2026 7:57 PM

Trump warns Iran over truce plan

వాషింగ్టన్‌: ఇరాన్ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. "ఇరాన్ తరఫున చర్చలు జరిపే ప్రతినిధులు చాలా భిన్నంగా, వింతగా ఉన్నారు. ఒప్పందం చేసుకోవాలని మమ్మల్ని వారు అడుక్కుంటున్నారు. ఎందుకంటే ఇరాన్‌ సైనికపరంగా పూర్తిగా నాశనమైంది. తిరిగి నిలబడే అవకాశం సున్నా. అయినా వారు బహిరంగంగా ఇంకా మా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. ఆలస్యం కాకముందే వాళ్లు త్వరగా సీరియస్‌గా ఆలోచించాలి. ఎందుకంటే, వారికి తిరిగి వెనక్కిచూసే అవకాశం కూడా రాకపోవచ్చు. తీవ్ర పరిణామాలు ఉంటాయి" అని ట్రంప్‌ హెచ్చరించారు.

మరోవైపు, ఇవాళ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో ఐఆర్‌జీసీ నేవీ చీఫ్‌ అలీరెజా టాంగ్సిరి మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి.

ఖార్గ్ దీవిపై అమెరికా దాడి చేస్తుందన్న భయంతో ఇరాన్‌ అక్కడ భద్రతను పెంచుతోంది. ఖార్గ్ దీవిని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఇరాన్‌ భావిస్తోంది. దీంతో ఇరాన్‌ అక్కడికి తమ సిబ్బందిని తరలిస్తోంది, దీవి చుట్టూ గగనతల రక్షణ వ్యవస్థను పెంచుతోంది. ఖార్గ్‌ దీవి వాటా ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఉంటుంది.

భుజంపై మోసుకెళ్లి ప్రయోగించే గగనతల క్షిపణి వ్యవస్థ (మాన్పాడ్స్)ను ఆ దీవి వద్ద పెంచుతోంది. అయితే, ఏ దాడి జరిగినా అధిక ప్రాణనష్ట ప్రమాదం ఉంటుందని అమెరికా అధికారులు, సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement