ఢాకా: బంగ్లాదేశ్‌లో ఫెర్రీ ఎక్కే ప్రయత్నంలో ఓ బస్సు పద్మా నదిలో పడిపోయింది. దీంతో 24 మంది మృతి చెందినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ప్రమాదం బుధవారం రాజ్‌బారి జిల్లాలోని దౌలత్‌డియా వద్ద జరిగింది. ఇది ఢాకా నుంచి సుమారు 100 కిలోమీటర్లు (62 మైళ్లు) దూరంలో ఉంది. ఫెర్రీ వద్దకు చేరుకునే సమయంలో బస్సు నియంత్రణ కోల్పోయి ఓ వైపునకు ఒరిగి, సుమారు 30 అడుగులు (9 మీటర్లు) లోతులో నదిలో మునిగిపోయిందని పోలీసులు, ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ (అగ్నిమాపక, అత్యవసర రక్షణ విభాగం) తెలిపారు.
నదిలో మునిగిన బస్సు నుంచి సిబ్బంది 22 మృతదేహాలను వెలికితీశారు, అందులో ఆరుగురు పురుషులు, 11 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని ఫైర్ సర్వీస్ అధికారి తల్హా బిన్ జాసిమ్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 4 ఫైర్ సర్వీస్ యూనిట్లు, 10 మంది డైవర్లు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
సైన్యం, పోలీసులు, కోస్ట్ గార్డ్, స్థానిక అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇంకా కొంత మంది ప్రయాణికులు అదృశ్యమై ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రతి సంవత్సరం రోడ్డు, ఫెర్రీ ప్రమాదాల్లో వందల మంది మరణిస్తున్నారు.


