ట్రంప్‌ యూటర్న్‌ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు | Trump U-Turn Iran Who Made Rs 840 Crore In 20 Minutes | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ యూటర్న్‌ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు

Mar 24 2026 5:33 PM | Updated on Mar 24 2026 6:10 PM

Trump U-Turn Iran Who Made Rs 840 Crore In 20 Minutes

ఇరాన్‌పై అమెరికా  ఇజ్రాయెల్‌  మొదలు పెట్టిన యుద్ధం, ఇరాన్‌ ప్రతిదాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం సంచలనం  రేపింది.  అయితే ఇరాన్‌పై దాడులను 5 రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు ట్రంప్‌ తీసుకున్న యూ టర్న్‌కు  ముందు   ఏం జరిగింది అనేది ప్రపంచ  వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ‌ ట్రంప్ సోమవారం ఉదయం తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో  వార్‌కు బ్రేక్‌ ప్రకటించడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు జరిగిన ఒక రహస్య ట్రేడింగ్ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏం జరిగింది?

20 నిమిషాల్లో రూ. 840 కోట్ల లాభం: మిస్టరీ ట్రేడ్
ఇరాన్ ఇంధన వనరులపై దాడులను తాత్కాలికంగా ఆపుతున్నామని  ట్రంప్‌ ప్రకటనకు కేవలం  15 నిమిషాల ముందే మార్కెట్‌లో భారీ ఎత్తున ట్రేడింగ్ జరిగినట్టు సమాచారం. ఈచెయిన్‌ రియాక్షన్‌ కేవలం  20 నిమిషాల్లోనే సుమారు రూ. 840 కోట్ల లాభాన్ని అందించిందని విశ్లేషకులు అంటున్నారు.

న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 6:50 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:20 గంటలకు). ఎవరో గుర్తుతెలియని వ్యక్తి/సంస్థ ఒక్కసారిగా రూ. 12,600 కోట్ల విలువైన S&P 500 ఫ్యూచర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దాదాపు రూ. 1,615 కోట్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్లను విక్రయించారు.

ట్రంప్‌ వార్‌ బ్రేక్‌ ప్రకటన రాగానే చమురు ధర భారీగా పడిపోయింది. అలాగే మార్కెట్ ప్రారంభానికి ముందే ఎస్&పి 500 ఫ్యూచర్స్ 2.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు బ్రెంట్ క్రూడ్ 109 డాలర్ల నుండి 92 డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ దాదాపు 6 శాతం పడిపోయి, బ్యారెల్‌కు 88.70 డాలర్లను తాకింది.

ఇరాన్‌పై దాడులు ఆగిపోవడంతో చమురు సరఫరాకు ఢోకా ఉండదని భావించిన ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో, బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 109 డాలర్ల నుండి 92 డాలర్లకు పడిపోయింది.

ఫలితంగా కేవలం ఆయిల్ ధరల మార్పు వల్లే ఆ వ్యక్తికి 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు (100 మిలియన్‌ డార్లు) లాభం వచ్చింది. ఇక షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన లాభం దీనికి అదనం.

'అన్‌యూజువల్ వేల్స్' అనే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ప్రకారం, ఈ ట్రేడ్లను నిర్వహించిన వారు రెండు సమన్వయ పందాలు వేశారు.  మొదటిది ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ పుంజుకుంటుందనే అంచనాతో, వారు సుమారు రూ. 12,600 కోట్లు లేదా 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్&పి 500 ఫ్యూచర్స్‌ను కొనుగోలు చేశారు.

రెండో బెట్‌ సరఫరా భయాలు తొలగిపోతే ముడి చమురు ధరలు తగ్గుతాయని అంచనాతో సుమారు రూ. 1,615 కోట్లు లేదా 192 మిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్స్‌ను విక్రయించారు. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో, దాదాపు 580 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 4,870 కోట్ల విలువైన 6,200 బ్రెంట్ మరియు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు చేతులు మారాయి. ఇది ఆ గంటలో ట్రేడ్ అవుతున్న మిగతా వాటి కంటే నాలుగు నుండి ఆరు రెట్లు ఎక్కువ.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలు
ట్రంప్ నిర్ణయం గురించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోయినా, అంత భారీ మొత్తంలో (రూ. 14,000 కోట్లకు పైగా) పక్కా టైమింగ్‌తో పెట్టుబడి పెట్టడం చూస్తుంటే.. ప్రభుత్వ నిర్ణయం ముందే ఎవరికైనా తెలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తన 25 ఏళ్ల మార్కెట్ అనుభవంలో ఇలాంటి వింతైన ట్రేడింగ్ పద్ధతిని ఎప్పుడూ చూడలేదని హెడ్జ్ ఫండ్ మేనేజర్ మాట్ విలియం  ఎక్స్‌లో పేర్కొన్నారు. ఒక యూ.ఎస్. బ్రోకరేజ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ కూడా ఇలాంటి ఆందోళనలనే వ్యక్తం చేశారు. కారణాన్ని నిరూపించడం సులభం కానప్పటికీ, ట్రంప్ పోస్ట్ వెలువడటానికి 15 నిమిషాల ముందు   ఏం జరిగింది అనేదానిపై   కచ్చితంగా  ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.

నికోలస్ మదురో అరెస్ట్‌కు ముందు కూడా
అలాగే గతంలో వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ విషయంలో కూడా ఇలాగే 'పాలీమార్కెట్'లో ముందే బెట్టింగ్ జరిగిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఒక వినియోగదారుడు జనవరి నాటికి అమెరికా వెనిజులాపై దాడి చేస్తుందని సుమారు 34వేల డాలర్ల పందెం వేశారు. దీంతో వీరికి  అంతర్గత సమాచారం అంది ఉంటుందనే అనుమానాలు ట్రేడర్లలో తలెత్తాయి.

కాగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దీనిపై ఇంకా స్పందించలేదు. ఒకవేళ విచారణ జరిగితే  దీని వెనుక  ఎవరున్నారు అనేది నిగ్గు తేలే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి : ఫోన్ లాక్ కోడ్‌ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్‌ మిస్టరీ

Advertisement
 
Advertisement
Advertisement