వాషింగ్టన్: ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో నాటోలోని దేశాలపై విమర్శలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. ఇటలీ, స్పెయిన్‌లో తమ సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. “అవును.. బహుశా నేను ఈ పనిని చేస్తాను. ఎందుకు చేయకూడదు. ఇటలీ మాకు ఎలాంటి సాయమూ చేయలేదు, స్పెయిన్ కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తోంది” అని వ్యాఖ్యానించారు.
అంతకు ముందు జర్మనీ విషయంలోనూ ఇలాంటి ప్రతిపాదనే చేశారు ట్రంప్. జర్మనీలో అమెరికా మోహరించిన వేలాది మంది సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, సమీక్షిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఇటీవల మాట్లాడుతూ.. ఇరాన్‌తో జరిగిన చర్చల్లో అమెరికా బలహీనంగా కనిపించిందని, సరైన ఫలితం తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఫ్రెడ్రిక్ ఆ విమర్శ చేసిన నేపథ్యంలో ట్రంప్ జర్మనీలో సైనికులను తగ్గిస్తామంటూ స్పందించారు.
కాగా, 2025 డిసెంబర్ 31 నాటికి ఇటలీలో 12,662 మంది, స్పెయిన్‌లో 3,814 మంది క్రియాశీల అమెరికా సైనికులు ఉన్నారు. జర్మనీలో 36,436 మంది ఉన్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ఇవ్వకపోవడం, హార్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోవడం వల్ల నాటో మిత్రదేశాలపై ట్రంప్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇరాన్ విషయంలో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ధైర్యం లేదంటూ ఈ నెల ప్రారంభంలో ట్రంప్ విమర్శించారు. గత వారం వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఇరాన్‌పై సైనిక చర్యలకు మద్దతు ఇవ్వనందుకు స్పెయిన్‌ను నాటో నుంచి సస్పెండ్ చేయాలన‍్న విషయాన్ని అమెరికా పరిశీలిస్తోంది.


